మాస్‌మహారాజా కెరీర్ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అనే విధంగా తయారైంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా రంగానికి వచ్చి చిరంజీవి తర్వాత స్టార్ హోదా దక్కించుకుని ‘మాస్ మహారాజా’గా నీరాజనాలు అందుకున్నాడు. మినిమం గ్యారంటీ స్టార్‌గా ఆయన పేరు ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా ఆయన చేసే టైప్ క్రాక్ హీరో పాత్రలు, డైలాగ్‌లు ఆయనకే సొంతం అనేలా చేసేవాడు. హీరో పాత్ర ద్వారానే మాస్ ప్రేక్షకులకు నవరసాల కిక్కును కామెడీతో కలిపి ఇచ్చేవాడు. దాంతో విమర్శకులు ఈయన సినిమా రొటీన్ అన్నా కూడా చివరకు అవి మంచి ఎంటర్‌టైనర్స్‌గా నిలిచేవి. పవన్‌కళ్యాణ్ వంటి హీరో రవితేజ అలా సిగ్గుపడకుండా ఎలా నటిస్తాడో అర్ధం కాదంటూ ఆయనకు కాంప్లిమెంట్ ఇచ్చాడు.
కానీ ‘బెంగాల్‌టైగర్’ నుంచి పరిస్థితి మారింది. మరలా చాలా గ్యాప్ తర్వాత దిల్‌రాజు, అనిల్‌రావిపూడిలతో జత కట్టి ‘రాజా దిగ్రేట్’ ద్వారా టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ ఆ తర్వాత మరలా షరా మామూలే అన్నట్లుగా టచ్‌చేసిచూడు, నేలటిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోనిలతో డిజాస్టర్స్ అందుకుంటున్నాడు. ప్రస్తుతం ‘డిస్కోరాజా’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం సమంత ప్రధానపాత్రలో రూపొందుతున్న ‘ఓ బేబీ’కి దగ్గరగా ఉంటుందనే అనుమానం కొద్ది ‘ఓ బేబీ’ విడుదలయ్యే వరకు వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నాడు.
తాజాగా ఆయన ‘డిస్కోరాజా’ తర్వాతి చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. డాన్‌శ్రీను ద్వారా తానే దర్శకునిగా పరిచయం చేసి, ఆ తర్వాత అదే దర్శకునితో బలుపుతో హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని దీనికి దర్శకుడట. గోపీచంద్ మలినేని చివరి చిత్రం సాయిధరమ్‌తేజ్‌తో విన్నర్. ఇది డిజాస్టర్ అయింది.. అయితే ఈసారి గోపీ తయారు చేసిన సబ్జెక్ట్ మాస్ మసాలా కాదని, ఇదో నిజజీవిత సంఘటన ద్వారా తయారు చేసుకున్న రియలిస్టిక్ స్టోరీ అని తెలుస్తోంది. రవితేజతో వారు చేస్తున్నారు.. వీరు చేస్తున్నారు.. అదే చాంతాండంత లిస్ట్ బయటకు వస్తూనే ఉంటాయి గానీ వాటిల్లో 90శాతం అసలు ప్రారంభమే కావడం లేదు. మరి గోపీచంద్ మలినేని చిత్రం అయినా పట్టాలెక్కుతుందో లేదో వేచిచూడాల్సివుంది...!