తెలుగులో కామెడీకి స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన వారిలో ప్రధముడు రాజేంద్రప్రసాద్. తాను ఏదైనా టెన్షన్లలో ఉన్నప్పుడు రాజేంద్రప్రసాద్ కామెడీ చిత్రాన్ని చూసి రిలాక్స్ అవుతానని స్వయంగా బహుభాషా కోవిదుడు, దేశం మెచ్చిన మేథావి, మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు వంటి వ్యక్తి చెప్పాడు. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసే కమెడియన్లకు లోటు లేదు గానీ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాలలో నటించి, హీరోగా కూడా కమెడియన్ గా నటించే చిత్రాలు అన్ని భాషల్లో కంటే తెలుగులోనే ఎక్కువ. రాజేంద్రప్రసాద్ తర్వాత ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ, కామెడీ చిత్రాల హీరోల అల్లరినరేష్‌కి వచ్చిన క్రేజ్ ఎవ్వరికీ రాలేదు. చంద్రమోహన్, సీనియర్ నరేష్, బ్రహ్మానందం, అలీ నుంచి సునీల్, సప్తగిరి వరకు కామెడీ హీరోలుగా నటించినా అల్లరోడి రూటే సపరేట్.
అయితే ఈయనలో ఎంతో మంచి నటుడు కూడా ఉన్నాడని ‘గమ్యం, శంభో శివ శంభో, నేను, ప్రాణం’ వంటి చిత్రాలు నిరూపించాయి. ఇటీవల వచ్చిన ‘మహర్షి’లో కూడా మహేష్ కంటే అల్లరినరేష్‌కి ఎక్కువ ఔన్నత్యం ఉందనేది వాస్తవం. ఇక అతి వేగంగా హీరోగా 50 చిత్రాలను పూర్తి చేసిన అల్లరోడు ఆ తర్వాత గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇక ఈయన నటించిన చిత్రాలలో స్ఫూర్ఫ్‌లు బాగా నవ్విస్తాయి. అలాగని వేరే హీరోలు బాధపడే రకంగా, వారి అభిమానులు ఫీలయ్యే విధంగా కాకుండా నీట్‌గా ఉండి అవి అందరినీ అలరిస్తాయి. ఇక ఈయన ‘దొంగలబండి’ చిత్రంలో తన ప్రేయసి సిక్స్‌ప్యాక్ కావాలని కోరుకుంటుంది. దానికి ఆయన ఆరు సిగరెట్ ప్యాకెట్లను పెట్టుకుని సిక్స్ ప్యాక్ అంటూ అలరిస్తాడు.
తాజాగా అల్లరినరేష్ మాట్లాడుతూ.. నేను ఎక్కడ ఎదురుపడినా ప్రభాస్ ఇదే విషయం గురించి ప్రస్తావిస్తాడు. ఫ్యాన్స్ కోసం మేము ఆరేడు నెలలు కష్టపడి సిక్స్‌ప్యాక్ తెచ్చుకుంటే సిగరెట్ ప్యాకెట్లతో నువ్వు నీ అభిమానులను నవ్విస్తావా? మేము ఎంతో కష్టపడి చేసిన వాటిని నువ్వు ఇలా లైట్‌గా తీసుకుంటావేంట్రా బాబూ..! అంటూ ప్రభాస్ నవ్వేస్తూ ఉంటాడని అల్లరినరేష్ చెప్పుకొచ్చాడు.