కొన్ని సినిమాల నుంచి మెయిన్ టెక్నీషియన్స్ సడన్‌గా తప్పుకున్నప్పుడు యూనిట్ హైరానా పడుతుంది. ‘సై..రా’ చిత్రం నుంచి రెహ్మాన్ తప్పుకున్నప్పుడు కూడా అభిమానులు బాగా ఆందోళన చెందారు. కానీ విడుదలకు 75 రోజుల ముందు అందునా ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ చేస్తోన్న హాలీవుడ్ రేంజ్ యాక్షన్ మూవీ, ప్యాన్ ఇండియా చిత్రం ‘సాహో’ నుంచి శంకర్ -ఎహసాన్-లాయ్‌లు సంగీత దర్శకులుగా తప్పుకున్నా కూడా ‘సాహో’ టీం ఎలాంటి ఆందోళన లేకుండా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఈ చిత్రం విడుదల తేదీని ఆగష్టు 15కు ఫిక్స్ చేస్తూ పోస్టర్స్ వదిలినప్పుడు అందులో మిగిలిన టెక్నీషియన్స్‌ను చూపించిన ‘సాహో’ టీం సంగీత దర్శకులకు మాత్రం చోటివ్వకపోవడంతో ఆ అనుమానం అప్పుడే వచ్చింది. అయితే ‘సాహో’ నుంచి శంకర్-ఎహసాన్-లాయ్‌లు తప్పుకోవడానికి ‘సాహో’ టీం కారణం కాదు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రిలీజ్ చేస్తోన్న ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టి-సిరీస్ వారిదే తప్పు అని తేలుతోంది. బాలీవుడ్‌లో ఒక్కో చిత్రానికి ముగ్గురు నలుగురు వేర్వేరు సంగీత దర్శకులు పనిచేస్తూ ఉంటారు.
దాంతో ‘సాహో’లో కూడా శంకర్-ఎహసాన్-లాయ్‌లతో పాటు ఇతర సంగీత దర్శకుల చేత కూడా సంగీతం అందించాలని టిసిరీస్ భావించింది. కానీ అది బాలీవుడ్ ట్రెండే అయినా తాము దానికి విరుద్దమని ఆ సంగీత త్రయం తప్పుకుంది. అయినా ‘సాహో’ టీం నిశ్చింతగా ఉంది. దీనిని టీజర్‌కి సంగీతం అందించిన థమన్ చేతుల్లో పెడతారని వార్తలు వచ్చాయి. కానీ ఈ మూవీకి జిబ్రాన్ సంగీతం అందిస్తాడని తెలుస్తోంది. జిబ్రాన్‌కి ‘విశ్వరూపం, విశ్వరూపం 2’ లకు సంగీతం అందించిన అనుభవం ఉంది. కమల్‌హాసన్ చేతనే ఇళయరాజా తర్వాత అంత మంచి టెక్నీషియన్‌గా జిబ్రాన్‌కి కాంప్లిమెంట్స్ కూడా అందాయి.
మరోసారి ‘సాహో’ దర్శకుడు సుజీత్, ప్రభాస్ దృష్టిలో పడటానికి కారణమైన ఆయన మొదటి చిత్రం ‘రన్ రాజా రన్’కి కూడా జిబ్రానే సంగీతం అందించాడు. అందులోని ‘బుజ్జిమా బుజ్జిమా’ పాట యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇటీవల ఆయన తమిళంలో ‘రాట్ససన్’కి అందించిన బీజీఎం ఎందరి ప్రశంసలనో పొంది చిత్రాన్ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది.. సో.. ‘సాహో’ యూనిట్ జిబ్రాన్‌తో సంగీతం అందించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.