అసలే ఇటీవల జరిగిన పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కనీవినీ ఎరుగని ఘోరపరాజయం పాలైంది. ఈ దెబ్బతో చంద్రబాబు కనీసం మొహం కూడా చూపకుండా ఇంటికే పరిమితం అవుతున్నాడు. ఇంతకు ముందు జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా తమది జాతీయపార్టీ అని బీరాలు పలికి చంద్రబాబు ఘోరపరాజయం పాలయ్యాడు. తెలంగాణలో టిడిపి వల్లనే కాంగ్రెస్‌కి కూడా పరాభవం తప్పలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 23 స్థానాలను మాత్రమే టిడిపి సంపాదించింది. బొట్టాబొట్టిన ప్రతిపక్ష స్థానం దక్కించుకుంది. ఈ ఓటమిని టిడిపి నాయకులు,కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
వచ్చే ఎన్నికలు జరిగే 2024 నాటికి చంద్రబాబు వయోవృద్దుడై ఉంటాడు. బాలయ్య, లోకేష్‌లకు పార్టీని నడిపే సత్తా లేదు. దాంతో అందరు జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుకుంటున్నారు. నటుడు బ్రహ్మాజీ నుంచి వర్మ వరకు అదే పాట పాడుతున్నారు. అసలే ఎన్నికల్లో ఘోరపరాజయంతో అవమానంగా ఫీలవుతున్న చంద్రబాబుని వర్మ మాత్రం వదలడం లేదు. జగన్‌ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తర్వాత కాస్త రెస్ట్ తీసుకుని మరలా ట్వీట్ పెట్టాడు.
ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో టిడిపికి ఎదురైన ఘోరపరాజయాన్ని అందరూ మర్చిపోవాలంటే పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్‌కి అప్పగించాలి. మునిగిపోతున్న నావ వంటి టిడిపిని రక్షించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తారక్ ఒక్కడే. జూనియర్ ఎన్టీఆర్‌కి తన తాతగారిమీద ఏమైనా అభిమానం ఉంటే వెంటనే టిడిపిని రక్షించే బాధ్యతలను తీసుకోవాలి. ఆ బాధ్యతలను తారక్ తన భుజాలపై వేసుకోవాలని సూచించాడు. ఈ ట్వీట్‌కి జూనియర్ అభిమానుల నుంచే కాదు.. టిడిపి శ్రేణుల నుంచి కూడా గట్టి మద్దతు లభిస్తోంది.