తెలుగులో ఇంతకు ముందు ఏమో గానీ ఈమధ్యకాలంలో తొలిసారిగా కోటి రూపాయల పారితోషికం డిమాండ్ చేసి సాధించిన హీరోయిన్‌గా గోవా బ్యూటీ, గోవా కోవా, నాభిసుందరి ఇలియానా పేరు ముందుగా వినిపిస్తుంది. ఆ తర్వాత దక్షిణాదిలో నయనతార నుంచి అనుష్క, రకుల్‌ప్రీత్‌సింగ్ నుంచి పలువురు ఈ రేటుని అందుకోగలిగారు. ఇక దక్షిణాది చిత్రాలలో హీరోయిన్లకు తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. బిజినెస్, కలెక్షన్లు, ఓపెనింగ్స్ వంటివన్నీ హీరోని పేరును బట్టే జరుగుతాయి. కాబట్టి దక్షిణాది చిత్రాలకు హీరోయిన్లు ఇచ్చే కాల్షీట్స్ కూడా చాలా తక్కువ రోజులు ఉంటాయి. కానీ మన హీరోయిన్లు మాత్రం ఉత్తరాది అదేనండీ బాలీవుడ్‌తో పోల్చుకుంటే మన హీరోయిన్లకు ఇచ్చే పారితోషికం చాలా తక్కువ అని వాపోతు ఉంటారు. కానీ బాలీవుడ్‌లో హీరోయిన్లని బట్టి కూడా బిజినెస్ జరగడంతో పాటు, కాల్షీట్స్ కూడా భారీగానే కేటాయిస్తారు.
ఇక విషయానికి వస్తే ‘ఛలో’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ‘గీతగోవిందం’కు కూడా గీతా మేడమ్ అలియాస్ రష్మికా మందన్న 10 నుంచి 20లక్షల లోపే తీసుకుంది. కానీ ‘గీతగోవిందం’ సాధించిన విజయంతో పాటు ఆమెకి తెలుగుతో పాటు తమిళం, కన్నడలో కూడా స్టార్స్ సరసన ఆఫర్లు వస్తూ ఉండటంతో ఈమె అమాంతంగా తన పారితోషికాన్ని భారీగా పెంచిందట. ఈమె పారితోషికం అంతా నటించే హీరోలు, దర్శకులను బట్టి ఉంటుందని అంటున్నారు. పెద్ద టాప్‌స్టార్స్ చిత్రాలకు 80 లక్షల వరకు డిమాండ్ చేస్తోన్న ఆమె చిన్న చిత్రాలు, మీడియం రేంజ్ హీరోలతో నటించడానికి మాత్రం కోటి ఇస్తే గానీ ఒప్పుకోవడం లేదంట.
చాలా తక్కువ చిత్రాలతోనే గీతా మేడమ్ ఈ రేంజ్‌ని అందుకోవడం సంతోషకరమైన విషయమే అయినా మీడియం చిత్రాల హీరోలు, దర్శకనిర్మాతలు ఈమె చెప్పే రేటు విని కళ్లు బైర్లుకమ్ముతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి? క్రేజ్ ఉన్నప్పుడే నాలుగురాళ్లు సంపాదించుకోవాలనే తరహాలో మనహీరోయిన్స్ ఉన్నప్పుడు... అందునా హీరోయిన్ల కెరీర్ అతి తక్కువ సమయం కావడంతో ఇందులో తప్పేమి లేదనే చెప్పాలి.