జనసేనాని మొదటి నుంచి ఒకే మాట చెబుతున్నాడు. తాను నీతి, నిజాయితీలతో కూడిన రాజకీయాలు చేసేందుకు, ప్రజల సమస్యలను తీర్చడానికే వచ్చానని, డబ్బు పంచనని, నిజాయితీని గెలిపించాలని ఆయన కోరారు. కిందటి ఎన్నికల్లో విజయం సాధించిన టిడిపికి, వైసీపీకి మధ్య ఓట్ల శాతం చాలా తక్కువ. టిడిపికి లభించిన ఆ కాస్త ఎక్కువ శాతం ఓట్ల వల్లే ఆయన గెలవగలిగాడు. నిజానికి ఈ ఓట్లు సాధించడంలో పవన్ కీలకపాత్ర పోషించాడు. ఈ ఎన్నికల్లో మాత్రం పవన్ వామపక్షాలు, బీఎస్పీల పొత్తుతో ఎన్నికల్లో నిలబడ్డాడు. ఓట్ల శాతం మాత్రం గణనీయంగానే వచ్చింది. నిజానికి ఈ ఓట్ల శాతమే టిడిపిని దాదాపు 40 స్థానాలలో ఓడిపోయేలా చేసింది. అలా పరోక్షంగా పవన్ టిడిపి దారుణ ఓటమికి, వైసీపీకి లభించిన ఘనవిజయానికి గానీ కారణమయ్యారు.
ఇకపోతే ఈ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి బిజెపి తరుపున సినీ నటి మాధవీలత పోటీ చేసింది. తాజాగా ఆమె పవన్ ఓటమితో పాటు పలు విషయాలపై మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె పవన్ ఫ్యాన్స్‌పై మండిపడింది. ఆమె మాట్లాడుతూ, నేను ఓడిపోయినందుకు ఏమాత్రం బాధగా లేదు. ఎక్కడా నేను గెలుస్తానని చెప్పలేదు. నాకు ముందే ఓడిపోతానని తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల నుంచి ఓడిపోవడం నాకు వింతగా, విడ్దూరంగా ఉంది. మోదీ ప్రధాని కావాలని కోరుకున్నాను. అనుకున్నట్లే మోదీ మరోసారి దేశ ప్రధాని అయ్యారు.
ఇంతకీ పవన్ ఫ్యాన్స్ ఏమయ్యారు? పవన్‌పై అభిమానంతో ఎన్నెన్నో మాటలు చెప్పారు. ఇదేనా మీ ప్రేమ? పవన్ ఓటమిని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. చదువుకున్న వారు రాజకీయాలలోకి రావాలని కోరుకుంటున్నామని అంటారు. మరి జేడీ లక్ష్మీనారాయణను ఎందుకు ఓడించారు? విద్యార్ధులు ఏమయ్యారు? డబ్బుకు, కులానికి అమ్ముడు పోయారా? రాజకీయాలలో నీతిగా, నిజాయితీగా ఉంటే గెలిపించరా? ఈవీఎంలతో మోసం చేసి బిజెపి గెలిచిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. మరి అదే నిజమైతే మూడు రాష్ట్రాలలో బిజెపికి ఒక్క సీటు కూడా ఎందుకు రాలేదు? ఇది ప్రజల తీర్పు.. అంతేగానీ ఈవీఎంల మాయ మాత్రం కాదు.. అని తేల్చిచెప్పింది.