తన కెరీర్ మొదట్లో చిన్న బడ్జెట్ చిత్రాలతో కూడా వినూత్నమైన ప్రేమకథలు, కొత్త నటీనటులతో కూడా కోట్లు కొల్లగొట్టవచ్చని నిరూపించిన దర్శకుడు తేజ. రామోజీరావు పుణ్యాన ‘చిత్రం’, ఆ తర్వాత ‘నువ్వు-నేను, జయం’ వంటి వరుస బ్లాక్‌బస్టర్స్ ఇచ్చాడు. ఆయనకు నాడున్న రేంజ్‌కి మహేష్ పిలచి మరీ ‘నిజం’ చిత్రం ఇచ్చాడు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఈయన జాతకం తిరగబడింది. ‘జై, ధైర్యం, అవునన్నా.. కాదన్నా, ఒక విచిత్రం, లక్ష్మీకళ్యాణం, కేక, నీకు నాకు డ్యాష్‌డ్యాష్, వెయ్యి అబద్దాలు, హోరాహోరి’ వంటి చాంతాడంత ఫ్లాప్‌లు ఎదుర్కొంటున్నాడు. ఈయన తీసే చిత్రాలు రొటీన్‌గా ఉంటున్నాయని, ఈ విషయంలో ఈయన తన గురువు వర్మని ఫాలో అవుతున్నాడని విమర్శలు ఎదుర్కొన్నాడు.
ఇక రాజశేఖర్‌తో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం షూటింగ్ చేసి మరీ క్లైమాక్స్‌లో వచ్చిన విభేదాల వల్ల ఆ చిత్రాన్ని సురేష్‌బాబు నిర్మాతగా రానాతో తీశాడు. సురేష్‌బాబుకి ఉన్న అనుభవం, కథలో జడ్జిమెంట్ నుంచి సినిమా షూటింగ్ ఎన్నిరోజులు? ఎంత బడ్జెట్? వంటి వాటిపై అవగాహన ఉండటంతో ఈచిత్రం తెలుగులో హిట్టయ్యింది. అయితే ఈ కథ తనదేనని మరో రచయిత ముందుకు వచ్చాడు. ఇది నిజమని కూడా తేలింది. చివరకు తేజ అతడిని ఏదో విధంగా కాంప్రమైజ్ చేశాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’తో ముచ్చటపడిన బాలయ్య తనతండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌ని తేజ చేతుల్లో పెట్టాడు.
కానీ దాని నుంచి బయటకు వచ్చి , మరలా తన సొంతంగా ‘సీత’ చిత్రం తీశాడు. ఇందులో హీరో పాత్రని మలిచిన తీరు, లెంగ్త్ రెండు గంటల 45నిమిషాలు ఉండటం వంటివి ప్రేక్షకులను ఇబ్బంది పెడుతున్నాయి. కాజల్, సోనూసూద్‌ల పాత్రలే మెప్పిస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్‌ని వదులుకున్న తేజ అంతకు మించిన కసితో పెద్దహిట్‌తో వస్తాడని భావిస్తే, ఆ ఆశ అడియాశ అయిందనే చెప్పాలి.