అక్కినేని కోడలు, నాగచైతన్య శ్రీమతి సమంత పెళ్లయినా కూడా నటిగా తన జోరు చూపుతోంది. ఆమె వివాహం తర్వాత తెలుగులో నటించిన ‘రంగస్థలం, మహానటి, రాజుగారి గది2’ చిత్రాలు బాగా ఆడాయి. ముఖ్యంగా ‘రంగస్థలం’ చిత్రంలోని పాత్రతో ఆమె ప్రేక్షకుల మనసు దోచింది. ఇక తమిళ చిత్రాలలో కూడా ఈమె జోరు చూపుతోంది. ముఖ్యంగా ‘సూపర్ డీలక్స్’ మూవీ ఆమెకి నటిగా మంచి పేరు తెచ్చింది. ‘అభిమన్యుడు’తో పాటు సమంత నటించిన చిత్రాలకు తమిళతంబీలు నీరాజనాలు పలికారు. అయితే ఆమె ఎంతో కష్టపడి, ఇష్టపడి కన్నడలో సూపర్ హిట్ అయిన ‘యూటర్న్’ మూవీ ఫీల్ చెడకూడదనే ఉద్దేశంతో ఒరిజినల్ వెర్షన్ దర్శకుడితో తెలుగులో రీమేక్ చేసింది. దీనికి అనధికారికంగా ఆమె నిర్మాత అని కూడా ప్రచారం సాగింది. కానీ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందినా, కమర్షియల్గా విజయం సాధించి, లాభాలు తేలేదు.
అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. బాగా ఆడని, లాభాలు తేలేని చిత్రం ఎంత గొప్పదైనా తనకు విజయం కిందకు రాదని, లాభాలు తెచ్చే చిత్రమే అసలైన విజయమని చెప్పింది. ఆ రకంగా చూసుకుంటే ‘యూటర్న్’ ఆమె దృష్టిలో నిరాశపరిచిందనే చెప్పాలి. తాజాగా ఆమె మరలా అలాంటి ప్రయోగమే చేస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో సురేష్ బాబుతో పాటు మరో ముగ్గురు నిర్మిస్తున్న చిత్రం ‘ఓ బేబీ’. ఈమూవీ కూడా కొరియన్ సూపర్ హిట్ మూవీ ‘మిస్ గ్రాని’కి రీమేక్. ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్ విడుదలైంది. కొరియన్ మూవీకి నందిని రెడ్డి పలు మార్పులు చేర్పులు చేసిందని సమాచారం.
గతంలో కూడా ఓ బాలీవుడ్ చిత్రానికి ఫ్రీమేక్ అంటూ నందినిరెడ్డి సిద్దార్ద్, సమంతలతో ‘జబర్ధస్త్’ పేరుతో తీస్తే ప్రేక్షకులు తిరస్కరించారు. ఇక ‘ఓ బేబీ’ చిత్రం విషయానికి వస్తే ఓ బామ్మ తన వయసు తగ్గి మరలా వయస్సులో ఉన్నట్లుగా కావాలని కలలు కంటుంది. ఓ రోజు ఫొటో స్టూడియోకి వెళ్లిన ఆవిడ కుర్రయువతిగా మారిపోతుంది. అలా యువతిగా మారిపోయిన పాత్రలో సమంత నటిస్తుండగా.. బామ్మ పాత్రలో సీనియర్ నటి లక్షీ నటిస్తూ ఉండటం విశేషం. లక్షీ పాత్రలోనే సమంత ఎక్కువ సేపు కనిపించినా కథ మొత్తం లక్ష్మీ పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. మరి ఈ ప్రయోగాన్ని లేడీ ఓరియంటెడ్గా రూపొందుతున్న ‘ఓ బేబీ’ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచిచూడాల్సి ఉంది.