‘అజ్ఞాతవాసి’తో తన కెరీర్‌లోనే ఎన్నడు ఎదుర్కోని విమర్శలను త్రివిక్రమ్ ఎదుర్కొన్నాడు. అసలు ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడా? లేక పవనే తీశాడా? అనే అనుమానాలు వచ్చాయి. తనదైన శైలిలో డైలాగ్స్ రాసే త్రివిక్రమ్ మార్క్ అందులో కనిపించలేదు. దాంతో ఈయన రాసిన డైలాగ్స్, పాటల చిత్రీకరణ వరకు తీవ్రంగా నిరాశపరిచి ఆ చిత్రం డిజాస్టర్ కావడానికి కారణంగా నిలిచాయి. అయితే ఆయన మీద నమ్మకంతో జూనియర్ ఎన్టీఆర్ ఆయనతో ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం తీశాడు. మరీ బ్లాక్‌బస్టర్ కాకపోయినా ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది.
ప్రస్తుతం ఆయన అల్లుఅర్జున్‌తో ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత హ్యాట్రిక్ చిత్రానికి పనిచేస్తున్నాడు. ఈ మూవీని గీతాఆర్ట్స్ సంస్థతో పాటు హారిక అండ్ హాసిని సంస్థ నిర్మిస్తోంది. దీని తర్వాత త్రివిక్రమ్ ఏ హీరోతో చేస్తాడనే సస్పెన్స్ కొనసాగుతోంది. ‘హారిక అండ్ హాసిని’ బేనర్‌లో ఆయన విక్టరీ వెంకటేష్‌తో ఓ చిత్రం చేయాల్సివుంది. ఇక కొరటాల శివ చిత్రం తర్వాత చిరంజీవితో చేయాల్సిన ప్రాజెక్ట్ కూడా లిస్ట్‌లో ఉంది. ఇదే సమయంలో మహేష్‌బాబు కూడా ‘అతడు, ఖలేజా’ తర్వాత త్రివిక్రమ్‌తో మరో చిత్రం చేయడం కోసం చర్చలు సాగుతున్నాయని తెలిపాడు.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం జరిగింది. తన తండ్రి హరికృష్ణ కారు ప్రమాదంలో మరణించడం తెలిసిందే. దాంతో తన పుట్టినరోజు వేడుకలను జరుపవద్దని, కేవలం సామాజిక కార్యక్రమాలే చేయాలని ఆయన తెలిపాడు. అయినా ఆయన పుట్టినరోజు నాడు పలువురు అభిమానులు ఎన్టీఆర్‌ని కలిసేందుకు వచ్చారు. మొదట తన ఇంటి బాల్కనీ నుంచి విష్ చేసిన ఆయన కొందరు అభిమానులు రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత ఎవరితో చేస్తారు అని అడిగితే త్రివిక్రమ్‌తో చేస్తానని చెప్పాడట. మొత్తానికి త్రివిక్రమ్ ముందుగా ఎవరితో చేస్తాడో చూడాలి.