నేటిరోజుల్లో మీడియా పోకడే మారిపోతోంది. తమకు డబ్బు, బహుమతులు గట్రా ఇచ్చే చిత్ర నిర్మాతల చిత్రాలకు, స్టార్ హీరోల చిత్రాలకు మాత్రం బాగా కవరేజ్ ఇస్తుంటారు. స్టార్ హీరోల వేడుకలను ప్రసారం చేయడానికి చానెళ్ల వారు పోటీ పడుతుంటారు. దీనికి కారణం వారికి టిఆర్పీలు లభిస్తాయి. ఇక చిన్న చిత్రాల విషయంలో ఏదో ఒక ప్రతిఫలం లేనిదే కవరేజ్ ఇవ్వరు. ఇక విషయానికి వస్తే జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత ఎంతో కాలం తర్వాత మాదాల రంగారావు తరం అయిపోయిన వేళ పీపుల్స్‌స్టార్‌గా పేరొందిన ఆర్.నారాయణమూర్తి ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ ఉద్యమ చిత్రాలను, సమాజంలోని పీడిత, బాధితుల సమస్యలను తెరకెక్కిస్తూ వస్తున్నారు.
బడా బడా నిర్మాతలు కూడా రెండు మూడు ఫ్లాప్‌లు వస్తే చాపచుట్టేసే రోజుల్లో కేవలం నిబద్దతతో, తాను నమ్మిన సిద్దాంతాల కోసం జయాపజయాలకు అతీతంగా ఆయన చిత్రాలు తీస్తూనే ఉన్నారు. తానే హీరో, దర్శకునిగా, సంగీత దర్శకునిగా.... ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈయన చిత్రాలకు మీడియా కవరేజ్ ఉండదు. ఎందుకంటే ఆయన జర్నలిస్ట్‌ల ఫార్మాలిటీస్‌ని అందించలేరు.
ఇక విషయానికి వస్తే తాజాగా ఆయన ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ అనే చిత్రం తీస్తున్నాడు. ఈ చిత్రానికి ఎలాగైనా మీడియా అటెన్షన్ కోసం మెగాస్టార్ చిరంజీవిని వేడుకకు తీసుకుని వచ్చాడు. దీని వల్ల ఆయన కోరుకున్న మీడియా కవరేజ్ బాగా వచ్చింది. ఈ సభలో ఆయన చిరంజీవిని కేవలం మీడియా కవరేజ్ కోసమే పిలిచానని, ఆయన రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు. ఈ చిత్రమైనా ‘ఎర్రసైన్యం’ తరహాలో ఆడితే ఆర్.నారాయణమూర్తికి పూర్వవైభవం వస్తుందని చెప్పాలి. మరి ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ ఆ స్థాయి హిట్ అందుకుంటుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది.