అదేమి చిత్రమో గానీ తెలుగులో ఫ్లాప్ ముద్రపడిన చిత్రాలను కూడా బాలీవుడ్‌లో యూట్యూబ్‌లు, డిజిటల్‌రైట్స్, డబ్బింగ్ రైట్స్ వంటి సహకారంతో విపరీతంగా ప్రేక్షకులను బాగా ఆదరించేస్తున్నారు. బన్నీ నటించిన ‘డిజె, సరైనోడు’ చిత్రాలతో పాటు పలు చిత్రాలు ఇలా బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. హిందీ జనం ఊరమాస్ చిత్రాలను బాగా ఆదరిస్తున్నారని దీనిని బట్టి మనకు అర్ధమవుతోంది. అందుకే పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు తెలుగులో లేని యాక్షన్ సీన్స్‌ని ప్రత్యేకంగా తీసి హిందీ వెర్షన్స్‌కి యాడ్ చేస్తున్నారు. ఇక బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సంగతి చెప్పుకోవాలంటే ఇప్పటివరకు ఆయన నటించిన దాదాపు అన్ని చిత్రాలు ఊరమాస్‌కి చెందినవే. హీరోయిజంని పీక్స్‌లో చూపించినవే.
దీనితో ఈయన చిత్రాలను కూడా పలు విధాలుగా హిందీ సినీ ప్రేమికులు ఆదరిస్తున్నారు. ఇలా తెలుగులో కొంతమార్కెట్ ఉన్న బెల్లంకొండ హీరోకి బాలీవుడ్ డబ్బింగ్‌లతో పాటు శాటిలైట్, డిజిటల్‌రైట్స్, యూట్యూబ్‌ల వల్ల బాగానే గిట్టుబాటు అవుతుండటం వల్ల ఆయన మార్కెట్ స్టామినా కాస్తైనా పెరిగి, సేఫ్ ప్రాజెక్ట్‌లుగా నిలవడంలో సక్సెస్ అవుతున్నాయి. ఇలా వేడినీళ్లకు చల్లనీరు జోడవుతూ పెట్టిన పెట్టుబడిని రాబడుతున్నాయి. తాజాగా ‘సీత’ ప్రమోషన్స్ సందర్భంగా బెల్లంకొండ హీరో మాట్లాడుతూ, నాకు హిందీలో మంచి మార్కెట్ ఉంది. అందుకే హిందీ కోసం అదనంగా కొన్ని సీన్స్ తీస్తున్నాం. బన్నీ నటించిన చిత్రాలకు బాలీవుడ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ లభిస్తున్నాయి. భగవంతుడు నాకు కూడా కాస్త హిందీ మార్కెట్‌ని ఏర్పరచినందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చాడు.
ఇక ‘సీత’ విషయానికి వస్తే ఇందులో బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన కాజల్ అగర్వాల్, సోనూసూద్‌లు కూడా నటిస్తూ ఉండటం బాలీవుడ్‌కి ప్లస్ కానుంది. ఇక ఈ చిత్రం స్టోరీ గురించి సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ, 20 ఏళ్లు జనాలకు దూరంగా మనసు పొల్యూట్ కాని అబ్బాయి జనారణ్యంలోకి వస్తే ఏమైంది? డబ్బే ప్రధానం అనుకునే అమ్మాయికి ఆ అబ్బాయికి ప్రేమ ఎలా కలిగింది? అనేది పాయింట్‌గా చెప్పుకొచ్చాడు. ఇందులో మొదటిసారిగా తాను కామెడీ పంచే పాత్రలో నటిస్తున్నానని సాయి చెప్పుకొచ్చాడు.