మహేష్‌కి అడిగినంత పారితోషికం ఇవ్వడానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సిద్ధం అయింది. ఆల్‌రెడీ ఆ సంస్థ తమ తొలి చిత్రంగా మహేష్‌తోనే ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చింది. మరోవైపు ‘రంగస్థలం’ చిత్రంతో మైత్రి సంస్థ, సుకుమార్‌లు నాన్‌బాహుబలి రికార్డులను తిరగరాశారు. అయినా అలాంటి కాంబినేషన్‌కి కూడా సుకుమార్ ఫుల్‌నెరేషన్‌తో రాకపోవడంతో మహేష్ నో చెప్పి తను ఇకపై సినిమాల విషయంలో ఎంత పట్టుదలగా ఉండదలచుకున్నాడో అర్ధమయ్యేలా చెప్పాడు. ఇక ‘మహర్షి’ చిత్రం మీద ఆయన పెట్టుకున్న నమ్మకాలు నూటికి నూరు శాతం కాకపోయినా కనీసం 75శాతం రీచ్ అయ్యాయి. దాంతో ‘బ్రహ్మోత్సవం, స్పైడర్’ ఫలితాల వల్ల తనలోని అపరిచితుడని మహేష్ బయటకు తీశాడు. మునుపెన్నడు చేయని విధంగా ‘మహర్షి’ చిత్రానికి ఆయన అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ చేయడం మొదలెట్టాడు.
ఇక తదుపరి ఆయన యుకె వెకేషన్స్‌కి వెళ్లి, ఇంగ్లాండ్‌లో జరిగే క్రికెట్ ప్రపంచకప్‌ని వీక్షించి ఇండియా వచ్చిన వెంటనే అనిల్ రావిపూడి చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. ఇదే సమయంలో ఆయన నటించే 27వ చిత్రంపై ఊహాగానాలే తప్ప ఇప్పటికీ అఫీషియల్ స్టేట్‌మెంట్ రాలేదు. పరుశురాం దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బేనర్‌లో అల్లుఅరవింద్ నిర్మాతగా ఓ చిత్రం ఉంటుందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మహేష్‌కి పరుశురాం చెప్పిన లైన్ అయితే నచ్చిందని, ఫుల్ నెరేషన్‌తో రమ్మని పంపాడని అంటున్నారు.
‘గీతాగోవిందం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అందునా యంగ్ డైరెక్టర్ అయిన పరుశురాంకి ఇంత గ్యాప్ రావడం మంచిది కాదు. అందుబాటులో ఏ పెద్ద స్టార్ లేడు. దాంతో పరుశురాం ఎలాగైనా మహేష్‌ని ఒప్పించాలని కసరత్తు చేస్తున్నాడట. అయితే మహేష్‌ని మెప్పించలేకపోతే మాత్రం పరుశురాంకి మరలా ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ‘కబీర్‌సింగ్’ విడుదల అనంతరం సందీప్‌రెడ్డి వంగా.. మహేష్‌కి ఓ స్టోరీ చెప్పనున్నాడు. ఇలా పక్కలో బల్లెంలా ఉన్న సందీప్‌రెడ్డి వంగాని తట్టుకుని పరుశురాం మహేష్‌ని ఒప్పిస్తాడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది.