కంటెంట్ ఏమీ లేదని, తన గత ముని చిత్రాల సీక్వెల్స్ తరహాలోనే అటు ఇటుగా ‘కాంచన 3’ తీశాడని విమర్శకులు విమర్శించినా కూడా ‘కాంచన 3’ చిత్రం అతి తక్కువ వ్యవధిలోనే 100కోట్లు వసూలు చేసి తన సత్తా చాటింది. ఈ చిత్రం ఏ ప్రత్యేకతలు లేకపోయినా అలా విజయం సాధించడం ఎందరికో మింగుడుపడని విషయం. లారెన్స్ విషయంలో మనం ఒక విషయం చెప్పుకోవాలి. కొందరు హీరోలను ప్రేక్షకులు రీల్ హీరోలుగా కంటే రియల్ హీరోలుగా అభివర్ణిస్తూ వారి చిత్రాలను ఆదరిస్తూ, వారికి అభిమానులుగా మారుతుంటారు. ఈ కోవలోకి వచ్చే హీరోనే రాఘవలారెన్స్. ఆయన చేసే సామాజిక కార్యక్రమాలు ఎందరినో ఆయనకు అభిమానులుగా మార్చాయి. జల్లికట్టు ఉద్యమం నేపధ్యంలో నిరసన చేస్తోన్న మహిళలకు మరుగుదొడ్డి సౌకర్యాలు కలిగించడం కోసం స్వయంగా తానే క్యారవాన్‌లను మెరీనా బీచ్‌కి పంపాడు.
తన చిత్రం విడుదలై విజయం సాధించిన తర్వాత కాదు.. ప్రారంభం రోజునే తనకు వచ్చే రెమ్యూనరేషన్ నుంచి హిజ్రాలకు కొంత మొత్తం దానధర్మాలు చేస్తూ ఉంటాడు. చిన్నారులను, వృద్దులను చేరదీసి వారి ఆరోగ్యం, తిండి తిప్పల గురించి ఆలోచించి సాయం చేస్తూ ఉంటాడు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ముందుగా లారెన్స్ స్పందిస్తూ ఉంటాడు. ఇక ఇటీవల వచ్చిన గజా తుఫాన్ తమిళనాడు, కేరళ రాష్ట్రాలను తుత్తునియలు చేసింది.
ఈ సందర్భంగా లక్షల మంది ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కూడు, గూడు కోల్పోయారు. నాటి తుఫాన్‌లో కేరళకి చెందిన ఓ ముసలావిడ ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ విషయం లారెన్స్‌కి చేరింది. దాంతో ఆయన ఆ ముసలావిడకు సొంత ఇల్లు కట్టి ఇస్తానని హామీ ఇచ్చాడు. తాజాగా ఆయన దానిని మర్చిపోకుండా నిజం చేసి చూపాడు. ఆ ముసలావిడ కన్నీటి పర్యంతం అయిన వీడియోను లారెన్స్ చూసి చలించిపోయాడు. తాజాగా ఆయన ఆ ముసలావిడకు సొంత ఇంటిని తన స్వంత నిధుల నుంచి నిర్మించి ఇచ్చాడు. పూజలు నిర్వహించిన అనంతరం ఆ అవ్వతో కలిసి గృహప్రవేశం చేశాడు. ఈ విషయాన్ని లారెన్స్ ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆ ముసలావిడ దుస్థితిని తనకు తెలియజేసిన యువకులకు ఆయన ధన్యవాదాలు తెలిపి రియల్‌హీరో అనిపించుకున్నాడు.