రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కలిసి నటిస్తున్న అసలుసిసలు మల్టీస్టారర్‌పై తెలుగు, దక్షిణాది పరిశ్రమ వారితో పాటు బాలీవుడ్ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిని చూపుతున్నాయి. ఇటీవల రామ్‌చరణ్‌కి చీలమండలం గాయం కారణంగా, ఆ తర్వాత ఎన్టీఆర్ చేతికి గాయం వల్ల ఉత్తరభారతంలో చేయాల్సిన షెడ్యూల్ వాయిదా పడింది. ఇప్పుడు వీరిద్దరు కోలుకున్నారు కాబట్టి ఇకపై గ్యాప్ అనేది లేకుండా షూటింగ్‌ని పూర్తి చేసి 2020 జులై 30న విడుదల చేయాలని జక్కన్న పట్టుదలగా ఉన్నాడు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్‌లో ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. ఇదే షెడ్యూల్‌లో చరణ్ సరసన నటించనున్న అలియాభట్ కూడా జాయిన్ కానుంది. ఈ షెడ్యూల్ జరిగేలోపే ఎన్టీఆర్ సరసన నటించాల్సిన విదేశీ భామని ఫిక్స్ చేయాలని జక్కన్న భావిస్తున్నాడు.
ఇక ఇందులో కొమరం భీమ్ స్ఫూర్తి పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటిస్తున్నాడని యూనిట్ అంటోంది. ఇక రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు. సాధారణంగా ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు అభిమానులు ఆయనను ప్రత్యేకంగా కలుసుకునే వారు. కానీ అరవింద సమేత వీరరాఘవ చిత్రం షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ యాక్సిడెంట్‌లో మరణించడం, ఆ విషాదం నుంచి ఇంకా ఎన్టీఆర్ కోలుకోకపోవడంతో ఈ ఏడాది ఎలాంటి హంగామాలను తన పుట్టినరోజున చేయవద్దని ఎన్టీఆర్ కోరాడు. అయితే తన అభిమానులు ఈ ఏడాది సామాజిక కార్యక్రమాలు చేయాలని కోరాడు.
ఇక ఈ పుట్టినరోజున జక్కన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ లుక్‌ని ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌గా ఇస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయినా ఇప్పటికి కేవలం 25శాతం మాత్రమే షూటింగ్ జరిగి, ఇంకా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కూడా ఫిక్స్ కాని నేపధ్యంలో సినిమా విడుదలకు ఏడాదికి పైగా సమయం ఉండటం వల్ల బహుశా రాజమౌళి నుంచి ఇలాంటి గిఫ్ట్ ఆశించడం అత్యాశే అవుతుందని, ఏ విషయం రాజమౌళి క్లారిటీ ఇస్తే గానీ తేలదని అంటున్నారు. వెయిట్ అండ్ సీ...!