ఏ ముహూర్తాన చాలా గ్యాప్ తీసుకుని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ‘వాల్మీకి’ చిత్రాన్ని మొదలుపెట్టిందో గానీ ఈ మూవీకి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘జిగర్‌తాండా’కి రీమేక్‌గా ఈ మూవీ రూపొందనుంది. హరీష్‌శంకర్ ‘డీజే’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రీమేక్‌ని తెరకెక్కిస్తున్నాడు. తమిళంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేసి మెప్పించిన బాబీసింహా క్యారెక్టర్‌ని తెలుగులో పలు మార్పులు చేర్పులు చేసి వరుణ్‌తేజ్ క్యారెక్టర్‌ని మలిచారని తెలుస్తోంది. తమిళంలో సిద్దార్ద్ పోషించిన పాత్రను అధర్వ పోషించనున్నాడు. ఈ చిత్రంలో నటించేందుకు పూజాహెగ్డేని తీసుకోవాలని భావిస్తున్నారని, కానీ ఆమె రెమ్యూనరేషన్‌ని భారీగా డిమాండ్ చేస్తోందనే వార్తలు వచ్చాయి. వీటితో హర్ట్ అయిన పూజా ఇందులో నటించకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక తాజాగా ఈ చిత్రానికి మరో షాక్ తగిలింది. మొదట ‘వాల్మీకి’ చిత్రానికి టాలీవుడ్ నెంబర్‌వన్ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ని తీసుకున్నారు. కానీ ఆయన పలు క్రియేటివ్ డిఫరెన్స్‌ల కారణంగా అర్ధాంతరంగా ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు. గతంలో హరీష్‌శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్, డీజె’ చిత్రాలకు దేవిశ్రీ అద్భుతమైన సంగీతం అందించి ఉన్నాడు. అలాంటిది దేవి ఈ మూవీ నుంచి ఎందుకు బయటకు వచ్చాడనే విషయం ఆసక్తికరంగా మారింది. దేవిశ్రీ స్థానంలో మిక్కీ జెమేయర్‌ని తీసుకున్నారట. మిక్కీ ఓ మాస్ చిత్రానికి అందునా మంచి యంగ్‌స్టార్‌గా ఎదుగుతున్న వరుణ్‌తేజ్ చిత్రానికి ఎలాంటి సంగీతం అందిస్తాడో వేచిచూడాల్సివుంది.
ఈ ఏడాది ఇప్పటికే ‘వినయ విధేయ రామ, మహర్షి’ చిత్రాలకు మంచి మ్యూజికల్ ఆల్బమ్స్‌ని అందించలేకపోయాడని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మరి ఈ చిత్రం నుంచి ఆయన బయటకు రావడం అనేది దేవిశ్రీ నిర్ణయమా? లేక హరీష్‌శంకర్ నిర్ణయమా? అనేది తేలాల్సివుంది. మొత్తానికి దేవిశ్రీతోపాటు ఈ షాక్ ‘వాల్మీకి’పై కూడా పడేలా కనిపిస్తోంది.