పెద్ద హీరోలు తమ తమ చిత్రాలకు కాస్త గ్యాప్ తీసుకోవడం మంచిపనే. నేడు చిన్నహీరోలు కూడా ఇలాగే గ్యాప్ తీసుకుంటూ ఉన్నారు. అయితే ముందుగా రిలీజ్ చేయాలనుకున్న చిత్రం డేట్‌ని మరో పెద్ద హీరో వస్తున్నాడని భావించి వెంటనే తప్పుకోవడం పెద్దగా మంచిది కాదు. నిఖిల్ ‘అర్జున్ సురవరం’ విషయానికి వస్తే ‘అవేంజర్స్’ మీద భయంతో తన చిత్రం వాయిదా వేసుకున్నాడు. కానీ ‘అవేంజర్స్’ చిత్రం మూడు నాలుగు రోజులు మాత్రమే ప్రభావం చూపింది. ముఖ్యంగా పెద్ద చిత్రాలు విడుదలయ్యే సమయంలో చిన్న సినిమాలు విడుదలై మంచి కంటెంట్ అని పేరు తెచ్చుకుని, ఆ పెద్ద చిత్రం కన్నా ఇదే బాగుంది అనిపిస్తే ఇక తిరుగే ఉండదు.
ఈ విషయాన్ని గతంలోనే కాదు.. ఇటీవల కాలంలో కూడా ‘రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్‌రాజా, శతమానం భవతి’తో పాటు నాటి శేఖర్ కమ్ముల ‘ఆనంద్, హ్యాపీడేస్’ వంటివి కూడా పెద్ద చిత్రాల పోటీలో ఘనవిజయం సాధించాయి. ఇక ఇటీవల నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’, వెంకటేష్-వరుణ్‌తేజ్‌ల ‘ఎఫ్ 2’ చిత్రాలు కూడా భారీ పోటీలో వచ్చి బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి.
ఇక విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సై..రా’ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు విడుదల చేస్తే వరుస వీకెండ్స్‌ని, దసరా సెలవులను క్యాష్ చేసుకోవచ్చని భావిస్తున్నారట. మరోవైపు దసరాకి మరికొన్ని పెద్ద చిత్రాలు రానున్నాయి. ఇక విషయానికి వస్తే నాగార్జున నటించిన క్లాసిక్ హిట్ ‘మన్మథుడు’కి ప్రస్తుతం సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని కూడా దసరాకి ప్లాన్ చేశారు. కానీ ‘సై..రా’తో పోటీ వద్దని జులైలోనే ఈచిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘చిలసౌ’ దర్శకుడు రాహుల్‌రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో నాగార్జునకి జోడీగా రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తుండగా, స్వీటీ అనుష్క, కీర్తిసురేష్‌లతో పాటు నాగ్ కోడలు సమంత కూడా అతిథి పాత్రల్లో నటిస్తున్నారు.