ఈమధ్య మాస్‌మహారాజా దూకుడు బాగా తగ్గింది. చిరంజీవిలా ఎలాంటి ఫిల్మ్‌బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ కంటే చిన్నవేషాలు వేసుకుంటూ వచ్చిన ఆయన కృష్ణవంశీ, శ్రీనువైట్ల పుణ్యమా అని స్టార్ హీరోగా ఎదిగాడు. వరుసగా ఏడాదికి రెండు మూడు చిత్రాలు చేస్తూ మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ప్రస్తుతం యువహీరోలైన విజయ్ దేవరకొండ, నాని, నాగచైతన్య, నిఖిల్ వంటి హీరోల పోటీని తట్టుకోలేకపోతున్నాడు. ‘కిక్ 2’ నుంచి బాగా ఇబ్బందులు పడుతూ ఉండటంతో చాలా కాలం గ్యాప్ ఇచ్చి వరల్డ్‌టూర్ పూర్తిచేశాడు. దిల్‌రాజు పుణ్యమా అని ‘రాజా ది గ్రేట్’తో మరలా ట్రాక్‌లోకి వచ్చాడని పలువురు భావించారు. కానీ ఆ తర్వాత ‘టచ్ చేసి చూడు, నేలటిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోని’ వంటి చిత్రాలతో డిజాస్టర్స్ ఎదుర్కొన్నాడు. విభిన్న చిత్రాలను చేస్తానని మాట ఇచ్చి మరలా పరమరొటీన్ చిత్రాలు చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
ప్రస్తుతం ఆయన రామ్ తాళ్లూరి నిర్మాతగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ చేస్తున్నాడు. కానీ ఈ చిత్రం సమంత-నందిని రెడ్డి-సురేష్‌బాబుల కలయికలో కొరియన్ ఫిల్మ్‌కి రీమేక్‌గా రూపొందుతున్న ‘ఓబేబి’ చిత్రానికి కథాపరంగా బాగా సారూప్యత ఉండటంతో ఈ చిత్రం విషయంలో కూడా టెన్షన్ తప్పడం లేదు. ఆనంద్ గత చిత్రం ఒక్కక్షణం కూడా ఇలాగే దెబ్బతినడంలో ‘ఓబేబి’ విడుదలయ్యాక ఆ ఫలితం చూసి మరలా పట్టాలెక్కించడం మేలని యూనిట్ భావిస్తోంది.
ఇక విషయానికి వస్తే రాంగోపాల్‌వర్మ శిష్యుడైన అజయ్‌భూపతి తన మొదటి చిత్రం ఆర్‌ఎక్స్ 100తోనే భారీ విజయం అందుకున్నాడు. దాంతో పలువురు యంగ్ హీరోలు ఆయనతో టచ్‌లోకి వచ్చారని వార్తలు వచ్చాయి. తాను తయారు చేసుకున్న ‘మహాసముద్రం’ వంటి మాఫియా బ్యాగ్రౌండ్ చిత్రాన్ని ఆయన తీయాలనుకుంటున్నాడు. ఇందులో భాగంగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నాగచైతన్య, నితిన్, రామ్ వంటి వారికి చెప్పినా ఓకే కాలేదు.
దాంతో ఓ మంచి విజయం తర్వాత కూడా పాపం అజయ్‌భూపతికి ఏడాది కాలంగా గ్యాప్ వచ్చింది. చివరకు అజయ్ భూపతి చెప్పిన ‘మహాసముద్రం’ స్టోరీ రవితేజకు బాగా నచ్చిందట. దాంతో ఆయన బౌండ్‌స్క్రిప్ట్‌ని అడిగాడట. మరి తన స్క్రిప్ట్ ద్వారా రవితేజని మెప్పిస్తే అది రవితేజకి, అజయ భూపతికి కూడా మంచి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇది మొదటి నుంచి మల్టీస్టారర్ అని ప్రచారం సాగుతోంది. అది నిజమేనా? రవితేజ అందుకు ఒప్పుకుంటాడా? లేక సింగిల్ హీరోచిత్రమా? అనేది తెలియాల్సివుంది.