నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల తానే నిర్మాతగా తీసిన తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్స్ అయిన ‘కథానాయకుడు, మహానాయకుడు’ తీవ్రంగా నిరాశపరిచాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తన తండ్రి బయోపిక్‌ని చేసిన బాలయ్యకు ఇది చేదు అనుభవంగానే మిగిలింది. ఆ తర్వాత బాలయ్య ఎన్నికల పోటీలో బిజీ అయ్యాడు. ఇదే సమయంలో బాలయ్య వి.వి.వినాయక్, బోయపాటిలతో చిత్రాలు చేస్తాడనే వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా బాలయ్య ఇప్పటికే తమిళ సీనియర్ డైరెక్టర్ కె.యస్.రవికుమార్‌తో ‘జైసింహా’ చేసిన తర్వాత మరలా ఆయనతోనే తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. దీనికి కూడా నిర్మాత సి.కళ్యాణే కావడం విశేషం.
ఇక ఈమూవీలో బాలయ్య పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను చేస్తున్నాడని సమాచారం. బాలయ్య కెరీర్‌లో ‘ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ నుంచి రౌడీఇన్‌స్పెక్టర్, లక్ష్మీనరసింహా’ వంటి పోలీస్ పాత్రలు అద్భుతమైన విజయం సాధించాయి. మరోసారి బాలయ్య పవర్‌ఫుల్ పోలీస్ అనేసరికి అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఇందులో మరోసారి బాలయ్యతో విలన్‌గా జగపతిబాబు పోటీ పడనున్నాడు. బాలయ్య లెజెండ్ ద్వారానే విలన్‌గా మారిన జగపతిబాబు మరోసారి బాలయ్యతో నటిస్తూ ఉండటం మరో విశేషం. ఇక ఇందులో బాలయ్యకు లేడీవిలన్‌గా వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తోందని తెలుస్తోంది.
శరత్‌కుమార్ కుమార్తె అయిన వరలక్ష్మి హీరోయిన్‌గా రాణించలేకపోయినా ధనుష్ ‘మారి 2’, విశాల్ ‘పందెంకోడి2’ చిత్రాలతో పాటు మురుగదాస్-విజయ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘సర్కార్’ వంటి చిత్రాలలో కూడా హీరోలకు ధీటుగా నటించింది. అయితే గతంలో బాలయ్య ‘పలనాటి బ్రహ్మనాయుడు, సీమసింహం’ వంటి చిత్రాలలో లేడీ విలన్లు నటించారు. అవి డిజాస్టర్ అయ్యాయి. మరి ఈసారి వరలక్ష్మి శరత్‌కుమార్ బాలయ్య చిత్రంలో లేడీ విలన్‌గా నటిస్తూ ఉండటం విశేషం. ఇక కె.యస్. రవికుమార్ రజనీకాంత్ నటించిన ‘నరసింహ’ చిత్రంలో నెగటివ్ పాత్రకి రమ్యకృష్ణని తీసుకుని పెద్ద హిట్ కొట్టాడు. మరి కె.యస్, బాలయ్యకు కూడా బ్యాడ్‌సెంటిమెంట్ నుంచి బయటకు పడవేసి హిట్ ఇస్తాడేమో చూడాలి...!
ఇక ఈచిత్రానికి మొదట ‘రౌడీపోలీస్’ అనే టైటిల్‌ను అనుకున్నారు. కానీ ఇది డబ్బింగ్ చిత్రం టైటిల్‌గా అనిపిస్తోందని భావించిన సి.కళ్యాణ్ ఈచిత్రం కోసం పవర్‌ఫుల్‌గా ఉంటే ‘రూలర్’ అనే టైటిల్‌ని ఫిల్మ్‌ఛాంబర్‌లో రిజిష్టర్ చేయించాడు. ఇది బాలయ్య కోసమేనని చెప్పవచ్చు. పవర్‌ఫుల్ టైటిల్‌తో షూటింగ్‌కి రెడీ అవుతోన్న ఈ మూవీకి చిరంతన్‌భట్ సంగీతం అందిస్తున్నాడు. ‘జైసింహా’ తర్వాత మరోసారి ఓ హీరోయిన్‌గా హరిప్రియ నటించనుందట.