ఎన్నో అంచనాలతో చరిత్రను తిరగరాస్తుందని, మహేష్ కెరీర్‌లోనే ‘మహర్షి’ చిత్రం మాస్టర్‌పీస్ అవుతుందని ఘట్టమనేని అభిమానులు ఆశపెట్టుకున్నారు. కానీ దానిలో ‘మహర్షి’ చిత్రం సగం కూడా అంచనాలను అందుకోలేకపోయిందనేది వాస్తవం. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో మహేష్ చిత్రాలకు ప్రీమియర్లు వేసినా దుమ్ముదులిపేస్తాయనే నమ్మకం అందరిలో ఉంది. కానీ ‘మహర్షి’ చిత్రానికి ఓవర్‌సీస్‌లో వచ్చిన కలెక్షన్లు ఆయన స్థాయికి తగ్గట్లుగా లేవని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. బాహుబలి సరే.. అరవింద సమేత వీరరాఘవ, అజ్ఞాతవాసి, వినయ విధేయ రామ, మహానటి, గీతగోవిందం వంటి చిత్రాలు మొదటి రోజున చూపిన సత్తా కూడా మహర్షి అందుకోలేకపోతోంది.
అందునా ఏకంగా మహేష్ ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా, దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపివంటి మూడు గొప్ప సంస్థలు ఈ చిత్రం కోసం భాగస్వామిగా మారినా ఆ కోరిక తీరేలా కనిపించడం లేదు. ముఖ్యంగా సీఈవో టర్న్‌డ్ రైతు ఎపిసోడ్ లెంగ్త్ పెరిగిపోయిందని, మూడుగంటల చిత్రాన్ని చూడలేకపోతున్నామని, సాగతీత సన్నివేశాలు బాగా నెగటివ్ ప్రభావం చూపాయని వార్తలు వస్తున్నాయి. టాక్ కూడా యునానిమస్‌గా ఏమీ లేదు. ఇక ఈ సాగతీత సీన్స్‌పై దర్శకుడు వంశీపైడిపల్లి స్పందిస్తూ రిషి జర్నీని ఎలాబరేట్‌గా చూపించడం కోసమే ఎక్కువ సీన్స్ రాసుకున్నామని అంటున్నాడు. నిజానికి సినిమా అంటే నేటి రోజుల్లో రెండుగంటల్లో చెప్పేయాలి. లెంగ్త్ పెరిగినా కూడా రంగస్థలం లాగా ఆ ఫీల్ రానివ్వకుండా ఉండాలి. ఓ సీన్‌లో చెప్పే మొత్తాన్ని ఒక డైలాగ్‌లో చెప్పగలగాలి. అంతేకాదు... ఎలాబరేట్‌గా చెప్పాలనుకుంటే దీనిని ఏ టీవీ సీరియల్‌గానో, లేక వెబ్‌సిరీస్‌లానో తీసి ఉంటే బాగుండేది కానీ అందునా మహేష్‌బాబు చిత్రంపై ఆ ప్రయోగం చేయడం సరికాదు.
ఇక దిల్‌రాజు మాత్రం ఈ చిత్రం కనివినీ ఎరుగని చిత్రంగా చెప్పుకుంటున్నాడు. గతంలో ఆయన ‘కృష్ణాష్టమి’ చిత్రానికి తానే రివ్యూ రాసి రేటింగ్ ఇచ్చాడు. నితిన్‌తో తీసిన శ్రీనివాసకళ్యాణం సమయంలో ఇది చరిత్రలో రాని కథ అంటూ ఊదరగొట్టాడు. లవర్ గురించి అవే గొప్పలు పోయాడు. మొత్తానికి దిల్‌రాజు, వంశీపైడిపల్లి వంటి వారి నమ్మకాలు నిజమయ్యాయా? లేదా? అనేది మరో మూడు నాలుగు రోజుల్లో తేలిపోతుందనేది వాస్తవం.