పొట్లూరి వరప్రసాద్.. పివిపిగా, పెద్ద పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. ఈయన మహేష్‌తో కలిసి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మూెత్సవం చేసి భారీ స్థాయిలో నష్టపోయాడు. తదుపరి చిత్రాన్ని మరలా మహేష్‌తో చేసేందుకు వంశీపైడిపల్లి చేత తన సొంత ఖర్చులతో స్టోరీని తయారు చేయించాడు. కానీ మహేష్ మాత్రం దిల్‌రాజు-అశ్వనీదత్‌లతో తన 25వ చిత్రంగా వంశీపైడిపల్లిని ఖరారు చేయడంతో పివిపి ఈ విషయంలో కోర్టు దాకా వెళ్లాడు. ఎట్టకేలకు మహేష్ కరుణించి, తన వల్ల నష్టపోయిన పివిపిని ‘మహర్షి’ చిత్రంలో భాగస్వామ్యుడిని చేశాడు. ఇదంతా నాటి కథ, కానీ రాజకీయాలలో లాగానే సినిమాలలో కూడా శాశ్వత శత్రుత్వం, మితృత్వం ఉండవని, అవసరాన్ని బట్టి అన్ని మారిపోతుంటాయని మరోసారి ఈ ఘటన నిరూపించింది.
ఇక ఈ చిత్రం టైటిల్స్‌లో అన్నితానై వ్యవహరించిన దిల్‌రాజు, శ్రీవెంకటేశ్వర బేనర్ పేరు ముందుగా వస్తాయని అందరు అనుకున్నారు. కానీ అశ్వనీదత్, వైజయంతీ మూవీస్ పేర్లు ముందుగా రాగా, తర్వాత దిల్‌రాజు, ఆ తర్వాత పివిపి పేర్లు వచ్చాయి. ఇక విషయానికి వస్తే పివిపి తాను భాగస్వామిగా వ్యవహరించిన ‘మహర్షి’ చిత్రాన్ని విజయవాడలోని తన సొంత థియేటర్ పివిపి మాల్‌లో ప్రేక్షకులతో కలిసి వీక్షించాడు. సినిమా అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ సినిమాని వారం కిందట కూడా చూశాను. అప్పుడు మహేష్‌కి ఫోన్ చేసి మీకో బ్యాడ్ న్యూస్ అని చెప్పాను.
దాంతో మహేష్‌బాబు గారు కంగారుపడి పోయారు. బ్యాడ్‌న్యూస్ అంటున్నారేంటి? అని ఒకింత ఆందోళనగా అడిగారు. అందుకు నేను సమాధానం ఇస్తూ, ఇంతకు మించిన పెద్ద హిట్‌ని మీరు మరలా కొట్టలేరు. అదే మీకు బ్యాడ్‌న్యూస్ అని చెప్పాను. దాంతో ఆయన రిలీఫ్‌గా ఫీలయ్యారు. ఇది మహేష్ కెరీర్‌లోనే అతి పెద్ద బ్లాక్‌బస్టర్. ఈ సినిమా స్టోరీ లైన్‌ను మూడేళ్ల కిందటే వంశీపైడిపల్లితో కలసి మహేష్‌కి వినిపించాను. కథ నచ్చడంతో దిల్‌రాజుతో పాటు అశ్వనీదత్‌లు కూడా నిర్మాతలుగా చేతులు కలిపారు.. మహేష్ కెరీర్‌లోనే ఇంతకంటే ముచ్చటైన చిత్రం మరోటి ఉండదని పివిపి చెప్పుకొచ్చాడు.