కొంతమంది హీరోలు దర్శకుల విషయంలో పెద్దగా నమ్మకం ఉంచరు. పోనీ వారే డైరెక్టర్స్‌గా మారి సినిమాలు తీస్తారా? అంటే అదీ లేదు. పక్కవాడిని దర్శకునిగా పెట్టుకుని పెత్తనం మాత్రం తాము చేస్తుంటారు. ఇది చివరకు చేటు చేసినా చేయగలదు. ముఖ్యంగా స్టార్‌కిడ్స్‌ని పరిశ్రమకు పరిచయం చేసే సమయంలో ఆయా వారసుల కంటే వారి తల్లిదండ్రులే హైరానా పడిపోతూ ఉంటారు. ఇక విషయానికి వస్తే హీరో విక్రమ్ తెలుగుతో పాటు తమిళంలో ఎన్నో చిత్రాలలో నటించినా ఒక్క చిత్రం కూడా ఆయనకు బ్రేక్ ఇవ్వలేదు. అయినా ఎంతో కష్టపడి ఆయన ‘సేతు’, ‘శివపుత్రుడు’తో ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత ‘అపరిచితుడు’ నుంచి ఎన్నో విభిన్నమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయనకి దర్శకత్వం మీద కూడా మంచి అభిరుచే ఉంది. త్వరలో తాను సొంతగా డైరెక్షన్ చేస్తానని కూడా ప్రకటించాడు.
ప్రస్తుతం ఆయన తన కుమారుడు ధృవ్‌ని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్ ద్వారా తన కుమారుడి తెరంగేట్రం చేయిస్తున్నాడు. ఈ చిత్రం మొదట ‘వర్మ’ పేరుతో బాలా దర్శకత్వంలో పూర్తి అయింది. కానీ అవుట్‌పుట్ సరిగా లేదని మొత్తాన్ని పక్కనపెట్టి ‘అర్జున్‌రెడ్డి’ టీంలోని గిరీశయ్యను దర్శకునిగా తీసుకుని వర్మకి ఆదిత్య అనే పేరు తగిలించి ‘ఆదిత్యవర్మ’ అని తీస్తున్నారు. ఈ చిత్రం విషయంలో విక్రమ్ అతిగా జోక్యం చేసుకుంటున్నాడని విమర్శలు వస్తున్నాయి. తాను నటిస్తున్న చిత్రాల షూటింగ్స్‌ను కూడా పక్కనపెట్టి ఆయన తన కుమారుడి షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడికి, చివరకు విదేశాలకు కూడా వెళ్లిపోతున్నాడట.
అదేదో విక్రమే ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కావడమో, లేక తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ని తీసిన సందీప్‌రెడ్డి వంగానే తీసుకుని బాలీవుడ్ ‘కబీర్‌సింగ్’లా తీసి ఉంటే బాగుండేది కదా...! అనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బాలాని పక్కనపెట్టి పలు విమర్శలను ఎదుర్కొన్న చియాన్ విక్రమ్ ఈ ‘ఆదిత్యవర్మ’ కూడా తేడా కొడితే అందరు విక్రమ్‌నే విమర్శిస్తారు. తప్పంతా ఆయన వైపే చూపిస్తారు. మరీ ఇంతగా దర్శకునిపై నమ్మకం లేకుండా ప్రతి విషయంలోనూ విక్రమ్ వేలు పెట్టడం సరికాదని ఆయన సన్నిహితులు కూడా అభిప్రాయపడుతున్నారు.