ఉపాసన కామినేని కొణిదెలకు ప్లానింగ్ అంటే ఇష్టం. అటు కుటుంబానికి, ఇటు వృత్తికీ, అటు వ్యాపకానికీ అన్నిటికీ సమంగా సమయాన్ని పంచగల దిట్ట ఆమె. ఆమెకు సోషల్ మీడియా ఇంపార్టెన్సూ తెలుసూ. తన దగ్గర పనిచేసేవారి మనసులను అర్థం చేసుకోవడమూ తెలుసు. అందుకే బిజినెస్ ఉమెన్‌గా ఆమె తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు.
ఇటీవల ఉపాసన కామినేని తన 65 మంది కుటుంబసభ్యులతో దుబాయ్‌కు వెళ్లారు. 2019-20కి సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయడానికి వారందరితో ఆమె దుబాయ్ వెళ్లారు. ఈ కుటుంబం అపోలో లైఫ్ కుటుంబం. భారతదేశంలో అత్యుత్తమ ఆక్యుపేషనల్ హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడర్‌గా మంచి పేరున్న సంస్థ అపోలో లైఫ్. టీపీఏ సర్వీస్ ప్రొవైడర్లలో, ఇందులోని ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్‌స్యూరెన్స్ టీపీఏ లిమిటెడ్ మూడో స్థానంలో ఉంది. దాదాపు 32 మిలియన్ల మందికి ఇప్పటిదాకా సేవలు అందించింది.
అపోలో లైఫ్‌కు సంబంధించిన 2019 కార్యాచరణలు, ప్రణాళికలను చర్చించడానికే ఉపాసన కామినేని తన అపోలో లైఫ్ కుటుంబ సభ్యులను 65 మందిని దుబాయ్ తీసుకెళ్లారు. ఎప్పుడూ కార్యాలయంలో కూర్చుని ఉండేవారు పనిచేసే ప్రదేశంలో మార్పు వస్తే మెదడు మరింత చురుగ్గా, నవ్యమైన ఆలోచనలతో వికసిస్తుందని ఉపాసన నమ్మారు. అందుకే సెమినార్లను కూడా వినూత్నంగా బస్సుల్లోనూ, ఎడారుల్లోనూ నిర్వహించారు. ‘‘నా కుటుంబం, నా కంపెనీ చాలా హ్యాపీగా ఉంది. దాదాపు 50 శాతం మంది మహిళలు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతోనూ, గొప్ప విలువలతోనూ పనిచేస్తున్నారు. మా తాతయ్యగారు డా.ప్రతాప్.సి.రెడ్డి ఆశీస్సులతో 2019-20 మరింత ఆశాజనకంగా, విజయవంతంగా ఉంటుందని నమ్ముతున్నాను’’ అని ఉపాసన తెలిపారు.
సరికొత్త ప్రదేశాల్లో పర్యటిస్తూ, ఒకరితో ఒకరు ఆత్మీయంగా మెలుగుతూ, మరిన్ని కొత్త విషయాలను చర్చించుకుంటూ సాగే ఇలాంటి పర్యటనలు వృత్తిపరంగానూ మెరుగైన పనితీరును కనబరచడానికి ఉపయోగపడుతాయనడంలో అనుమానం లేదు.