Advertisement
Google Ads BL

దాసరి, నేను తాతా మనవళ్లం అవుతాం: చిరు


దివంగత దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు జయంతిని డైరెక్టర్స్‌డే పేరుతో గత ఏడాది నుంచి దర్శకుల సంఘం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా దాసరి జయంతి సందర్భంగా శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ హీరో చిరంజీవి టిఎఫ్‌డిఏ.ఇన్ పేరుతో ఏర్పాటు చేసిన వెబ్ సైట్‌ని ప్రారంభించారు. అనంతరం గత ఏడాది విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్న తొలి చిత్ర దర్శకులను సత్కరించి జ్ఞాపికల్ని అందజేశారు. నీది నాది ఒకే కథ చిత్రానికి గాను టి.కృష్ణ పురస్కారాన్ని దర్శకుడు వేణు ఊడుగుల అందుకోగా, కేరాఫ్ కంచరపాలెం చిత్రానికి గానూ కోడి రామకృష్ణ అవార్డును వెంకటేష్ మహా స్వీకరించారు. ఛలో చిత్రానికి గాను వెంకీ కుడుముల ఇ.వి.వి పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆర్‌ఎక్స్100 చిత్రానికి గానూ అజయ్ భూపతి విజయబాపినీడు పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డుతో పాటు 25 వేల రూపాయల నగదు బహుమతిని వీరికి చిరంజీవి అందజేశారు. విశ్వదర్శనం చిత్రానికి గానూ జనార్థన మహర్షిని, ఆంగ్ల చిత్రాన్ని తెరకెక్కించినందుకు గానూ వీఎన్ ఆదిత్యలను ఇదే వేదికపై చిరంజీవి సత్కరించారు. 

Advertisement
CJ Advs

అనంతరం చిరంజీవి మాట్లాడుతూ దాసరి నారాయణరావు పుట్టిన రోజుని దర్శకుల దినోత్సవంగా జరుపుకోవడం నిజంగా గొప్ప విషయం. ఓ దర్శకుడికి ఇంతకంటే గొప్ప నివాళి వుండదు. ఇది తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 24 శాఖలపై మంచి పట్టుతో ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించిన దర్శకులు దాసరి. నాటక రచయితగా, రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన వ్యక్తి. దాసరి లాంటి వ్యక్తి మరొకరు లేరు ఇక రారు. ఆయనతో కలిసి పని చేసింది ఒకే ఒక్క సినిమా లంకేశ్వరుడు. ఆయనతో నాకు అనుబంధం చాలా తక్కువ. రాఘవేంద్రరావుతో అత్యధికంగా చిత్రాలు చేశాను. దాసరితో ఎక్కువ చిత్రాలు ఎందుకు చేయలేకపోయానే అని బాధపడేవాడిని. ఆయన చాలా సందర్భాల్లో నన్ను మనవడిగా సంబోధించారు. అందరికి తెలియని విషయం ఒకటి వుంది. మా ఇద్దరికి చుట్టరికం వుంది. వరుసకు దాసరి, నేను తాతా మనవళ్లం అవుతాం. చివరి రోజుల్లో మా ఇద్దరి మధ్య బంధం బలపడింది. 

ఖైదీ నంబర్ 150 వేడుక విజయవాడలో జరిగినప్పుడు ఆయన అతిథిగా వచ్చి ఆశీర్వదించారు. ఓ రోజు పాలకొల్లు నుంచి బొమ్మిడాయిలు తెప్పించానని ఇంటికి వచ్చి భోజనం చేయాలని ఫోన్ చేసి భోజనం పెట్టారు. అల్లు రామలింగయ్య అవార్డుని ఆయన ఇంటికి వెళ్లి నా చేతులతో అందించి వచ్చాను. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా గొప్ప దర్శకులున్నారు. వాళ్లలో దాసరి శైలి ప్రత్యేకం. ఎంత మంది గొప్ప దర్శకులున్నా దాసరిని మించిన దర్శకులు లేరు ఇక రారు అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి దర్శకుల సంఘం సహాయ నిధికి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. 

అనంతరం దర్శకులు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ గతంలో ఓ వెలుగు వెలిగిన దర్శకులు ఇప్పుడు అవకాశాలు రాక, వయసు సహకరించక దయనీయ స్థితిలో వున్నారు. వారిని ఆదుకోవడానికి నా తరపున 10 లక్షలు, బాహుబలి నిర్మాతలు ఇచ్చే 15 లక్షలు కలిపి 25 లక్షలు అందించబోతున్నాను. మిగతా సంఘాల సభ్యులకు పెన్షన్‌లు, హెల్త్ కార్డ్‌లు వున్నాయి కానీ దర్శకుల సంఘంలోని సభ్యులకు అలాంటివి లేవు. అందుకే 5 కోట్లతో దర్శకుల సహాయనిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దర్శకుడు రాజమౌళి తన వంతుగా స్పందించి 50 లక్షలు విరాళం ఇస్తానని ప్రకటించారు. ఈ నిధికి విరాళాలు అందించడానికి అగ్ర దర్శకులు చాలా మంది ముందుకొస్తున్నారు. వారే కాకుండా నటీనటులు కూడా వారికి తోచిన మొత్తాన్ని దర్శకులు సంఘం సహాయనిధికి అందజేయాలని కోరుతున్నాం అన్నారు. 

దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ దర్శకుల సంఘం అధ్యక్షులు ఎన్.శంకర్ మాట్లాడుతూ స్వర్గీయ దాసరి నారాయణరావు పుట్టిన రోజును డైరెక్టర్స్ డేగా జరుపుకోవడం ఆనందంగా వుంది. ఇలాంటి సమయంలో అందరం కలిసి మన ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సైరా చిత్రీకరణ విదేశాల్లో జరుగుతున్నా.. కుటుంబం మొత్తం అక్కడే వున్న చిత్రీకరణకు చిన్న విరామం ఇచ్చి దర్శకుల సంఘం కుటుంబం కోసం అన్నయ్య చిరంజీవి ప్రత్యేక విమానంలో సొంత ఖర్చుతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక నుంచి కూడా దర్శకులు సంఘం నిర్వహించబోయే కార్యక్రమాలకు అన్నయ్య చిరంజీవి వెన్నుదన్నుగా నిలవాలని ఆశిస్తున్నాం. దర్శకుల సహాయ నిధికి విరాళాల ద్వారా ఒక్కరోజే కోటి రూపాయాలు సమకూరడం ఆనందంగా వుంది. మిగతా దర్శకులు కూడా సహకరిస్తే త్వరలోనే ఇది 5 కోట్లకు చేరుతుంది. ఈ విషయంపై త్వరలోనే అగ్ర దర్శకులం అంతా ప్రత్యేకంగా ఓ సమావేశాన్ని నిర్వహించుకోనున్నాం అన్నారు. 

ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, ప్రధాన కార్యదర్శి రామ్‌ప్రసాద్, దర్శకులు హరీష్‌శంకర్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, కాశీవిశ్వనాథ్, ఏ.ఎస్.రవికుమార్, తనికెళ్లభరణి, వి.ఎన్. ఆదిత్య, ఆర్.నారాయణమూర్తి, ఏ.కోదండరామిరెడ్డి, విజయభాస్కర్, శివనాగేశ్వరరావు, బీవీఎస్. రవి, వీరశంకర్‌తో పాటు దర్శకుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. 

Chiranjeevi speech at Directors Day celebrations:

Chiranjeevi about Dasari Greatness
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs