సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా.. సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా బుధవారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు.
ఇక మహేష్ బాబు ఫిల్మ్ ఈవెంట్ అంటే ఖచ్చితంగా ఎవరో ఒక స్టార్ హీరో అతిథిగా వస్తారనే ఫీలింగ్‌ను ‘భరత్ అనే నేను’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకతో కలిగించారు. ఆ ఫంక్షన్‌లో మహేష్ బాబు కూడా ఇకపై స్టార్ హీరోలు ఇలా ఈవెంట్స్‌కు హాజరవుతారని, టాలీవుడ్ ఇండస్ట్రీ ఇకపై కొత్తగా ఉండబోతోందని తెలిపాడు. ‘భరత్ అనే నేను’ ఈవెంట్ తర్వాత పెద్ద హీరోల ఫంక్షన్లకు ఇతర స్టార్ హీరోలు అతిథులుగా హాజరవుతుండటం గమనిస్తూనే ఉన్నాం. దీంతో ఇప్పుడు జరగబోయే ‘మహర్షి’ ఈవెంట్‌కు అతిథిగా ఎవరు వస్తారనే దానిపై ఆసక్తి క్రియేట్ అయింది.
దీని గురించే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొందరి పేర్లు కూడా వినిపించాయి. ఎన్టీఆర్ అని, చరణ్ అని, ఇద్దరూ వస్తున్నారని.. ఇలా వార్తలు వస్తున్న తరుణంలో.. ఈ వేడుకకు అతిథిగా వచ్చేది ఎవరో చిత్రయూనిట్ రివీల్ చేసింది. మహేష్ కోసం పెద్దోడు అతిథిగా రాబోతున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్‌కు అన్నగా నటించిన విక్టరీ వెంకటేష్ ఈ వేడుకకు అతిథిగా రాబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ఆఫీషియల్‌గా ప్రకటించింది. సో.. పెద్దోడు, చిన్నోడులను మరొక్కసారి ఒకే స్టేజ్‌పై చూసేందుకు రెడీ అయిపోండి.