టాలీవుడ్‌లో సీనియర్ స్టార్స్ అంటే మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ వంటివారిని చెప్పుకోవాలి. వీరు షష్టిపూర్తి వయసులో కూడా యంగ్‌స్టార్స్‌కి పోటీగా వరుస చిత్రాలు చేస్తూ, ఫిట్‌నెస్ విషయంలో వయసుతో ప్రమేయం లేదని, మనసుంటే మార్గం ఉంటుందని నిరూపిస్తున్నారు. మొదటగా మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే దాదాపు దశాబ్దం పాటు వెండితెరకు దూరం అయిన చిరంజీవి తన నటనలో గానీ, స్టెప్పులు, డ్యాన్స్, ఫైట్స్ విషయంలో తన సత్తా తగ్గలేదని ‘ఖైదీనెంబర్ 150’ ద్వారా నిరూపించాడు. పదేళ్ల ముందు ఎలాంటి ఫిట్‌నెస్, గ్రేస్‌తో ఉన్నాడో ఆ చిత్రంలో కూడా అదే విధంగా కనిపించి అందరిని మైమరిపించేలా చేశాడు. ఇక తర్వాత చేస్తున్న ‘సై...రా..నరసింహారెడ్డి’ చిత్రం స్వాతంత్య్రంకు పూర్వం, స్వాతంత్య్ర సమరయోధుని జీవిత చరిత్ర కావడంతో మరలా గుర్రపు స్వారీ, కత్తి యుద్దాలు వంటివి సాధన చేసి మెప్పించడానికి రెడీ అవుతున్నాడు.
ఇక నాగార్జున విషయానికి వస్తే ఈయన 60లో 30లా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే తన కుమారులైన నాగచైతన్య, అఖిల్‌ల కంటే నాగ్ ఇంకా చార్మింగ్‌గా ఉన్నాడు. ‘రాజన్న’ చిత్రం కోసం ఆయన కూడా గుర్రపుస్వారీ నేర్చుకున్నాడు. ప్రస్తుతం ‘మన్మథుడు 2’ చిత్రం షూటింగ్‌లో పోర్చుగీస్‌లో ఉన్న ఆయన జిమ్‌లు గట్రా లేని అడవుల్లో ఉండటం వల్ల చెట్లను ఆధారంగా చేసుకుని వర్కౌట్స్ చేస్తున్నాడు. ఇక వెంకటేష్ విషయంలో కూడా అదే నిజమవుతోంది. ఈయన ‘ఘర్షణ’ చిత్రం సమయంలో నిజంగా పోలీస్ అధికారి అనేలా బాడీ బిల్డింగ్ చేశాడు. ఇక ‘గురు’ చిత్రం కోసం భారీ కసరత్తులు చేసి బాక్సింగ్ కోచ్ అంటే ఇలా ఉండాలి అనిపించేలా కనిపించాడు.
ఇక బాలయ్య విషయానికి వస్తే అందరు యంగ్ హీరోల కంటే సినిమాల పరంగా జయాపజయాలకు అతీతంగా ఉండే ఆయన తాజాగా 20 కేజీల బరువు తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఆయన త్వరలో చేయబోయే కె.ఎస్. రవికుమార్ చిత్రం కోసం, ఆ తర్వాత బోయపాటి శ్రీను కోసం ఇంత బరువు తగ్గాలనే సంచలన నిర్ణయాన్ని బాలయ్య తీసుకున్నాడని తెలుస్తోంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య రౌడీ పోలీస్‌గా నటిస్తుండగా, బోయపాటి చిత్రంలో ఎలాంటి పాత్ర చేయనున్నాడు? అనేది తెలియాల్సివుంది. ముఖ్యంగా బాలయ్య బరువు తగ్గాలని నిర్ణయించుకుంది బోయపాటి చిత్రం కోసమే. అందుకోసమే ఇప్పటి నుంచే బరువు తగ్గడంపై దృష్టి పెట్టి కె.ఎస్.రవికుమార్ షూటింగ్ పూర్తయ్యే లోపల పూర్తిగా 20కేజీలు తగ్గడంపై బాలయ్య దృష్టి పెట్టాడు.