దేవిశ్రీప్రసాద్.. అతి చిన్న వయసులోనే సంగీత దర్శకునిగా పరిచయమై అత్యంత వేగంగా మెట్లు ఎక్కుతూ స్టార్ హీరోల చిత్రాలు అంటే దేవిశ్రీప్రసాదే సంగీతం అందించాలి అనే పేరు తెచ్చుకున్నాడు. ఇక త్రివిక్రమ్, సుకుమార్, దిల్‌రాజు వంటి వారికి ఆస్థాన సంగీత దర్శకునిగా ఉన్నాడు. ఇటీవలే త్రివిక్రమ్ ఈయనను పక్కనపెట్టి ‘అ..ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీరరాఘవ’ చిత్రాలకు దేవిశ్రీకి బదులు మరొకరిని పెట్టుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం అల్లుఅర్జున్‌తో చేస్తోన్న చిత్రానికి కూడా అరవింద సమేత వీరరాఘవ ఫేమ్ థమన్‌నే ఎంపిక చేసుకున్నాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్‌కి తెలుగులోనే కాదు.. తమిళంలో, హిందీలో కూడా మంచి గుర్తింపు వచ్చింది.
ఇక విషయానికి వస్తే సంక్రాంతికి వచ్చిన రామ్‌చరణ్-బోయపాటి చిత్రం వినయ విధేయ రామకి సంగీతం అందించాడు. ఈ చిత్రంలో ఓ పాట కూడా ప్రేక్షకులను అలరించలేదు. కానీ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో దేవిశ్రీపై ప్రత్యేకంగా విమర్శలంటూ రాలేదు. ప్రస్తుతం దేవిశ్రీ 1 (నేనొక్కడినే), శ్రీమంతుడు, భరత్ అనే నేను ల తర్వాత మహర్షికి మహేష్‌తో కలిసి పనిచేస్తున్నాడు. 1 (నేనొక్కడినే) ఫ్లాప్ అయినా మ్యూజికల్‌గా బాగానే మెప్పించింది. ఇక శ్రీమంతుడులో అన్ని పాటలు సూపర్. భరత్ అనే నేనులో రెండు పాటలు బాగా ఆకట్టుకున్నాయి. కానీ మహేష్‌కి ప్రతిష్టాత్మక చిత్రంగా, ఆయన 25వ సినిమాగా రూపొందుతున్న మహర్షిలోని పాటలు మాత్రం ప్రేక్షకులను బాగా నిరాశపరుస్తున్నాయి. ఇప్పటివరకు విడుదలైన నాలుగు పాటల్లో ‘పదరా పదరా’ పాట మాత్రమే ఫర్వాలేదనిపించుకుంది.
ఇక ‘పాలపిట్ట’ పాట ఎలా ఉంటుందో చూడాలి? ఏదైనా ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు అందరినీ తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. ఈ చిత్రం కనుక మ్యూజికల్‌గా కనీసం చిత్రీకరణ పరంగా కూడా ఆకట్టుకోలేక చతికిల పడితే మాత్రం అది దేవిశ్రీ కెరీర్‌కి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అసలు దేవిశ్రీ మంచి ట్యూన్స్ ఇవ్వడంలో విఫలమయ్యాడా? లేక ఆయన నుంచి సరైన అవుట్‌పుట్ రాబట్టడంలో దర్శకుడు వంశీపైడిపల్లి ఫెయిల్ అయ్యాడా? అనే సందేహం కూడా వస్తోంది. ఈ చిత్రం ట్యూన్స్‌ని రెడీ చేసేందుకు గాను దిల్‌రాజు, వంశీపైడిపల్లికి ఏకాంతంగా అమెరికా వెళ్లి బోలెడు డబ్బులు ఖర్చుపెట్టి ట్యూన్స్ ఇచ్చారు. మరి పాటలను వింటుంటే మాత్రం ఈ మాత్రం దానికే అంత హంగామా అవసరమా? అనే అనుమానం రాకమానదు.