మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లో మళ్లీ నవ్వుల ‘రంగుపడుద్ది’
కిషోర్ రాఠి సమర్పణలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అలీ మెయిన్ లీడ్ పోషిస్తున్న చిత్రం ‘రంగుపడుద్ది’. ధనరాజ్, సుమన్ శెట్టి, హీన, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావుల తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్. శ్యామ్ ప్రసాద్ దర్శకుడు కాగా.. మహేష్ రాఠి నిర్మాత. మే నెలలో విడుదలవుతున్న ఈ చిత్ర టీజర్‌ను తాజాగా విడుదల చేసారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు ధన్‌రాజ్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రానికి కారకుడైన అలీగారు లండన్ లో షూట్ తో బిజీగా ఉండటం మూలాన ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. సినిమా విషయానికి వస్తే అప్పట్లో ఇదే మనీషా బ్యానర్ లో బ్లాక్ బస్టర్ అయిన ఘటోత్కచుడు చిత్రంలో ఫేమస్ అయిన రంగుపడుద్ది డైలాగ్ నే ఇప్పుడు టైటిల్ గా పెట్టి మళ్లీ ఇదే బ్యానర్ లో ఓ మంచి కామెడీ హారర్ ను తెరకెక్కిస్తున్నారు. మనీషా ఫిలిమ్స్ బ్యానర్ కు మేము పెద్ద ఫాన్స్. అలాంటి బ్యానర్ లో మేము సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఇక కథ విషయానికి వస్తే రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే గొడవ చుట్టే కథ తిరుగుతుంది. దాన్నే ఔట్ అండ్ ఔట్ కామెడీతో తెరకెక్కించారు దర్శకుడు శ్యామ్ ప్రసాద్. ఆయన తీసిన మౌనమేలనోయి చిత్రానికి అందులో పాటలకు నేను వీరాభిమానిని. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా. యమలీల చిత్రంలో చినుకు చినుకు పాటను మళ్లీ ఇప్పుడు అప్పారావుకు హీరోయిన్ కు మధ్య కంపోజ్ చేశారు. అప్పుడు ఆ చిత్రం మ్యాజిక్ చేసింది ఇప్పుడు అదే మ్యాజిక్ చేయనుందని భావిస్తున్నా. మే మొదటి వారం కానీ రెండో వారంలో కానీ ఈ మా రంగుపడుద్ది సినిమా విడుదల కానుంది..’’ అని తెలిపారు.
దర్శకుడు ఎస్. శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. చాలా కాలం తరువాత ఇదే బ్యానర్ లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఒక బంగ్లాలో రెండు గ్యాంగ్‌ల మధ్య చోటు చేసుకునే ఘర్షణే చిత్ర కథాంశం. పూర్తి స్థాయి హారర్ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రం అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నా..’’ అన్నారు.
నిర్మాత మహేష్ రాఠి మాట్లాడుతూ.. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు చిన్న పిల్లల్ని సైతం మా ఈ రంగుపడుద్ది చిత్రం ఎంటర్టైన్ చేస్తుంది. చెప్పాలంటే ఈ సమ్మర్ వెకేషన్ కు కూల్ ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం అవుతుందని అన్నారు.
హీరోయిన్ హీన, అప్పారావు, షేకింగ్ శేషులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను, అభినందనలు పంచుకున్నారు.
అలీ, రఘుబాబు, ధనరాజ్, జబర్దస్త్ అప్పారావు, సుమన్ శెట్టి, షేకింగ్ శేషు, హీన ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ : మహేష్ రాఠి, డైలాగ్స్: అభయ్ శ్రీ జయ్, మ్యూజిక్: సుభాష్ ఆనంద్, ఎడిటర్: నందమూరి హరి, డిఓపి: జి. ఎస్. రాజ్ (మురళి), నిర్మాత: మహేష్ రాఠి, డైరెక్టర్: ఎస్. శ్యామ్ ప్రసాద్.