ప్రతి వ్యక్తికి ఇగో ఉంటుంది. కానీ అది అహంకారంగా మారరాదు. అందునా మీడియా, పబ్లిక్ ఎటెక్షన్ ఎక్కువగా ఉండే సెలబ్రిటీలు ముందు వెనుకా ఆలోచించకుండా చేసే కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయ. అందుకే నొప్పింపిక తానొవ్వక తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు కాంట్రవర్శీకి చోటు లేకుండా తమ గురించి ఎంత ఎక్కువగా, ఎంత గొప్పగా చెప్పుకున్నా ఇబ్బంది లేదు. కానీ వేరే వారితో పోలిక తెచ్చి ఎదుటివారిని కించపరిచేలా నోరు జారితో ఎదుటి వారి నుంచి తీవ్ర విమర్శలు తప్పవు. ఇలాంటి ఒక తలనొప్పి వ్యవహారాన్నే నాని హీరోగా గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో రూపొంది ఈనెల 19న విడుదల కానున్న ‘జెర్సీ’ తలకెత్తుకుంది. ఆమె ఎవరో కాదు.. కన్నడ నటి శ్రద్దాశ్రీనాథ్.
ఈమె కన్నడలో మంచి విజయం సాధించిన ‘యూటర్న్’తో పాటు తమిళ ‘విక్రమ వేద’ చిత్రంతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం దక్షిణాదిలో అందం, అభినయం రెండు కలిసి ఉన్న టాలెంటెడ్ హీరోయిన్‌లలో శ్రద్దాశ్రీనాథ్ అనడంలో తప్పు లేదు. తాజాగా ఈమె లౌక్యం తెలియకపోవడమో, లేక అహంకారమే... లేక మన ప్రేక్షకుల మనస్తత్వం, చిన్న విషయాలకే మనోభావాలు దెబ్బతింటాయనే విషయాలను గమనించకపోవడం వల్లనో సమంత అభిమానులు, అక్కినేని ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
తాజాగా ఆమె మాట్లాడుతూ, సమంత నటంచిన ‘యూటర్న్’ చిత్రాన్ని అరగంట కంటే ఎక్కువ చూడలేకపోయాను. నేను చాలా పొసెసివ్. నేను నటించిన పాత్రల్లో ఎవరినో ఊహించుకోవడం నా వల్ల కాలేదు.. అంటూ వ్యాఖ్యానించింది. తెలుగు ‘యూటర్న్’ చిత్రం కమర్షియల్‌గా పెద్ద కమర్షియల్ విజయం సాధించకపోయి ఉండవచ్చు గానీ ఇందులో సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి. టాలెంట్ ఉన్న నటి సమంత మీద శ్రద్దాశ్రీనాథ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపేలా ఉన్నాయి. కెరీర్ ప్రారంభంలోనే శ్రద్దాశ్రీనాథ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు. తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఆమె వ్యాఖ్యలు ఆమెపై నెగటివ్ ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు.