తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబుల తర్వాత ఫ్యామిలీ హీరోగా, లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండే హీరోగా జగపతిబాబుకి పేరుంది. అయితే ఆయన కేవలం ‘శుభలగ్నం, ఆయనకిద్దరు, మావిచిగురు’ వంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలే కాదు.. ‘గాయం, సముద్రం’ వంటి మాస్ చిత్రాలు కూడా చేశాడు. ఇక ఈయన కెరీర్ పరిసమాప్తి అవుతోందని అనుకున్న సమయంలో అనూహ్యంగా విలన్, క్యారెక్టర్ పాత్రలు పోషిస్తూ దక్షిణాది మొత్తంలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టుగా సాగుతున్నాడు.
ఈయన తాజాగా మాట్లాడుతూ, తన పలు జీవిత విశేషాలను పంచుకున్నాడు. ఈయన మాట్లాడుతూ, రమ్యకృష్ణ చాలా మంచి అమ్మాయి. డబ్బులను వృథా చేసుకోవద్దని నాకు మంచి సలహాలు ఇచ్చేది. ఇక సౌందర్య ఎంతో స్వచ్చమైన అమ్మాయి. ఆమని నటిగా ఎంతో గొప్పది. ఆమెతో నేను నటించిన ‘శుభలగ్నం’ చిత్రం నా కెరీర్‌లోనే బెస్ట్ చిత్రంగా నిలిచిపోయింది. అందులో ఆమని నటన అద్భుతం. అందరు నన్ను ఇండస్ట్రీలో స్త్రీలోలుడు అని భావిస్తారు. కానీ అది సరికాదు. ఆ మాటకు నేనొప్పుకోను. అమ్మాయిల పిచ్చి అంటే అది వేరే అర్ధం వస్తుంది. చాలామంది ఆ పదానికి అర్ధం తెలియకుండా వాడుతూ ఉంటారు. సరసానికి, అమ్మాయిల పిచ్చికి, ప్రేమకి ఎంతో తేడా ఉంది. నేను నా తల్లి నుంచి ప్రతి మహిళను ప్రేమిస్తాను.
నేను ప్రతిరోజు రెండు గంటలు యోగా చేస్తాను. మొదట ధ్యానంతో మొదలుపెట్టాను. ఆ తర్వాత యోగా వైపుకు వచ్చాను. నాకు యోగా అన్నా, ఆయుర్వేదం అన్నా ఎంతో నమ్మకం. ఇక నా శరీరానికి ఇబ్బంది కలిగించని ఆహారమే తీసుకుంటాను. గతంలో ప్రతిరోజు ఉదయం సద్ది అన్నం తినేవాడిని. ఇప్పుడు మాత్రం గంజినీళ్లు తాగుతున్నాను. వాటితో పాటు అల్లం రసం, కొబ్బరినీళ్లు తాగుతుంటాను. ఒకప్పుడు మాంసాహారం ఎక్కువగా తినేవాడిని. ఇప్పుడు ఆరోగ్యం రీత్యా దానికి చాలా దూరంగా ఉంటున్నాను. నా జీవితంలో 2008 నుంచి 2012 వరకు చీకటి రోజులుగా భావిస్తాను. ఆసమయంలో డబ్బుల కోసం పరమచెత్త చిత్రాలు కూడా చేశాను. నిర్మాతలు ఎంతిస్తే అంత తీసుకుని నటిస్తూ వచ్చాను. ఒకరకంగా మనసు చంపుకుని అలా నటించాల్సి వచ్చింది. అప్పటి పరిస్థితుల దృష్ట్యా అలా చేయకతప్పలేదు.
ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి దుర్ధశ ఉంటుంది. మా నాన్న, నిర్మాత వి బి రాజేంద్రప్రసాద్ ‘దసరాబుల్లోడు’ వంటి బ్లాక్‌బస్టర్స్ తీసి కూడా ఏమీ మిగుల్చుకోలేకపోయారు. ఆ సమయంలో మా నాన్న ఎన్నో చిత్రాలు తీసినా రాబడి కంటే ఖర్చే ఎక్కువగా ఉండేది. నేను హీరో అయిన తర్వాత మరింతగా నా మీద డబ్బు పెట్టి ఆయన నష్టపోయారు.. అంటూ తన మనసులోని భావాలను నిజాయితీగా బయటపెట్టాడు జగపతిబాబు.