ప్రస్తుతం టాలీవుడ్‌లో సీనియర్ స్టార్స్‌కి హీరోయిన్లకు బాగా కొరత ఉంది. శ్రియా, త్రిష, ఇలియానా, తమన్నా, అనుష్క, నయనతార వంటి వారు మాత్రమే ఓకే చెబుతున్నారు. మరోవైపు ఇటీవలే నాగార్జున మన్మథుడు2 లో నాగార్జున సరసన నటించేందుకు రకుల్‌ప్రీత్‌సింగ్ ఓకే చెప్పింది. ఇక విషయానికి వస్తే చిరంజీవి దాదాపు దశాబ్దం తర్వాత రీఎంట్రీ ఇస్తూ తన 150వ ప్రతిష్టాత్మక చిత్రంగా ఖైదీనెంబర్ 150 చేశాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయన్‌గా నటించింది. దీని తర్వాత ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా సై...రా... నరసింహారెడ్డి చేస్తున్నాడు. ఇందులో ఏరికోరి నయనతారని తీసుకున్నారు.
ఇక చిరు తనకు ఈ జనరేషన్ హీరోయిన్లలో తమన్నాతో డ్యాన్స్ చేయాలని ఉందని చెప్పాడు. బహుశా అందువల్లనో ఏమో సై..రాలో తమన్నా కూడా ఓ కీలకపాత్రను పోషిస్తోంది. ఇక ఈ చిత్రం పూర్తయిన వెంటనే చిరు కొణిదెల బేనర్‌తో పాటు మ్యాట్నీ సినిమా నిర్మాణ సంస్థల భాగస్వామ్యంలో మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను వంటి వరుస బ్లాక్‌బస్టర్స్ అందిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ చిత్రం కమర్షియల్ హంగులతో కూడిన కొరటాల శివ మార్క్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం అని తెలుస్తోంది.
ఇక విషయానికి వస్తే ఈ చిత్రంలో చిరు సరసన మహానటి ఫేమ్ కీర్తిసురేష్‌ని పెట్టుకోవాలని భావిస్తున్నారట. ఆల్‌రెడీ కీర్తిసురేష్ సూర్య, విక్రమ్, అజయ్‌దేవగణ్, రజనీకాంత్ వంటి సీనియర్లతో కూడా కలిసి నటిస్తోంది కాబట్టి ఈ చిత్రంలో నటించడానికి కీర్తికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవనే భావించాలి.