తెలుగు చిత్ర పరిశ్రమలో దాసరి తర్వాత సినీ పెద్దగా తమ్మారెడ్డి భరద్వాజని చెప్పుకోవాలి. ఇండస్ట్రీ సమస్యలపై, ఇండస్ట్రీలోని వారి మధ్య వచ్చే విభేదాల గురించి ఆయన నిర్మొహమాటంగా తన వాయిస్‌ని వినిపిస్తూ ఉంటాడు. ఆమధ్య ‘మా’లో శివాజీరాజా, సీనియర్ నరేష్‌ల మధ్య విభేదాలు, వారు మీడియా ముందుకు వచ్చి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం గురించి మాట్లాడుతూ, ఈ ఇద్దరు ఎంతో మంచివారు. ఇద్దరికీ ఎంతో కమిట్‌మెంట్ ఉంది. వాళ్లు ఇద్దరు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారు ఇలా మీడియా ముందు రచ్చ చేయడం సరికాదని తేల్చి చెప్పాడు.
తాజాగా ఆయన పవన్‌కళ్యాణ్-అలీల ఇష్యూ మీద కూడా స్పందించాడు. ఇటీవల పవన్ రాజమండ్రి సభలో అలీ వైసీపీలో చేరడంపై తీవ్రంగా స్పందించడం, అందుకు కౌంటర్‌గా అలీ ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తమ్మారెడ్డి మాట్లాడుతూ, పవన్‌కళ్యాణ్, అలీ ఇద్దర నాకు తెలుసు. ఈ ఇద్దరి మధ్య ఎంత స్నేహబంధం ఉందనేది కూడా నాకు బాగా సుపరిచితమే. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు ఒకరి గురించి ఒకరు స్పందించిన తీరు నాకు చాలా బాధని కలిగించింది. అలీ హర్ట్ కావడంలో అర్ధం ఉంది. వ్యక్తిగతంగా పవన్ విమర్శలు చేయకుండా ఉండాల్సింది.
ఇక అలీ కూడా వీడియో విడుదల చేయకుండా ఉండాల్సింది. ఈ విషయంలో ఆయన తొందరపడ్డాడు. ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకుని ఉన్నా ఈ అపార్ధాలన్నీ తొలగిపోయేవి. విషయం ఇంతవరకు వచ్చేది కాదు. పవన్, అలీ ఇద్దరు మంచి మనసున్నవారు. త్వరలోనే వారిద్దరు మరలా కలుసుకుంటారని భావిస్తున్నానని తమ్మారెడ్డి వ్యాఖ్యానించాడు.