ఏళ్లకు ఏళ్లు సరైన హిట్ కోసం ఎదురు చూస్తూ వచ్చిన నిన్నటితరం యాంగ్రీ యంగ్‌మేన్ నేటి యాంగ్రీస్టార్ డాక్టర్ రాజశేఖర్‌కి ఎట్టకేలకు ప్రవీణ్‌సత్తార్ దర్శకత్వంలో రూపొందిన ‘పీఎస్వీ గరుడు వేగ’ మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. కానీ భారీ బడ్జెట్, రాజశేఖర్ స్టామినాను మించిన బడ్జెట్ వల్ల ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నా కూడా కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ చిత్రం చూసిన సెలబ్రిటీల నుంచి సామాన్యప్రేక్షకుల వరకు రాజశేఖర్‌పై ప్రశంసల వర్షం కురిపించినా, వచ్చిన పాజిటివ్ టాక్‌ని సద్వినియోగం చేసుకోవడంలో ఈ చిత్రం విఫలమైంది. ఏదిఏమైనా ‘పీఎస్వీగరుడవేగ’ చిత్రం రాజశేఖర్‌కి మంచి సంతోషాన్నే కలిగించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా లేదా విలన్‌గా మారాలని భావిస్తున్న తరుణంలో ఇది ఆయనలో కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. ఈ ఊపులో ఉన్న రాజశేఖర్ ప్రస్తుతం ‘అ’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ చిత్రం చేస్తున్నాడు.
తాజాగా విడుదలైన ఈ చిత్రం టీజర్‌కి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు ప్రశాంత్ వర్మకే దక్కుతుందని చెప్పాలి. ఆయన మేకింగ్ తీరు, అద్భుతంగా ఉన్న సినిమాటోగ్రఫీ, బీజీఎంలు నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయనే చెప్పాలి. కాగా ఈ చిత్రం టీజర్‌ని చూసిన తర్వాత ఈ చిత్రం స్టోరీ లైన్ ఇదేనంటూ ఓ కథ ప్రచారంలోకి వచ్చింది. 1985లో కృష్ణా జిల్లాలోని మూడు ధనవంతులైన కుటుంబాలను చంపేందుకు ప్రత్యర్ధులు తాగే నీటి సరస్సులో విషం కలుపుతారు. అదే సమయంలో గుంటూరు జిల్లాలో మిస్టరీగా పలు హత్యలు జరుగుతూ ఉంటాయి. అవి ఆ ఊరి వాళ్లే చేసి ఉంటారు. ఈ రెండు సంఘటన నుంచి ప్రశాంత్ వర్మ ఈ ‘కల్కి’ కథను తయారు చేసుకున్నాడని తెలుస్తోంది.
నిజంగా ఇదే ఈ చిత్రం మెయిన్ పాయింటా కాదా? అనే విషయాన్ని పక్కన పెడితే టీజర్‌లోని విజువల్స్ మాత్రం దీనికి దగ్గరగా ఉన్నాయి. వీటిని విచారించేందుకు వచ్చిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో రాజశేఖర్ నటించనున్నాడు. మొత్తానికి ‘అ’తో తనలోని డిఫరెంట్ డైరెక్టర్‌ని రుచి చూపించిన ప్రశాంత్ వర్మ ‘కల్కి’ ద్వారా దానిని మరింత పదిలం చేసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి.