అతి తక్కువ కాలంలో స్టార్ హీరోల చిత్రాలకు సంగీతం అందించే స్థాయికి ఎదిగి అరవింద సమేత వీరరాఘవ ద్వారా తన వందో చిత్రాన్ని పూర్తి చేసుకున్నా కూడా థమన్‌పై ఉన్న కాపీ క్యాట్ ముద్ర పోలేదు. నిజానికి ఈయన తొలిప్రేమ, భాగమతిలతో పాటు అరవింద సమేత వీరరాఘవ చిత్రానికి కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. కానీ ఆయన అందించిన స్థాయి ట్యూన్స్‌కి సరితూగేలా త్రివిక్రమ్ చిత్రీకరణ లేకపోవడం పెద్ద మైనస్ అయింది. లేకుంటే ఈ చిత్రం మ్యూజికల్‌గా మరింత భారీ విజయం నమోదు చేసుకుని ఉండేది.
ఇక థమన్ విషయానికి వస్తే ఆయనకు దేవిశ్రీప్రసాద్, అనిరుధ్ వంటి వారి నుంచి పోటీ ఉన్నా కూడా బీజీఎం అందించడంలో మాత్రం ఈయన సిద్దహస్తుడయ్యాడు. మణిశర్మ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్న తెలుగు సంగీత దర్శకుల్లో మంచి బీజీఎం అందించే ఏకైక సంగీత దర్శకునిగా థమన్‌ని చెప్పుకోవాలి.
ఇక విషయానికి వస్తే తాజాగా శివనిర్వాణ దర్శకత్వంలో నిన్నుకోరి తర్వాత వచ్చిన రెండో చిత్రం ద్వితీయ విఘ్నాన్ని దాటి ‘మజిలీ’గా పాజిటివ్ టాక్‌తో దూసుకుని పోతోంది. ఈ చిత్రం చైతు కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచినవి మూడే అంశాలు. కథ పాతదే అయినా శివనిర్వాణ ఎమోషనల్ టేకింగ్, నాగచైతన్య, సమంతల పోటాపోటీ నటన, థమన్ అందించిన బీజీఎంలేనని చెప్పాలి. ఈ చిత్రానికి నిజానికి మలయాళ సంగీతదర్శకుడు గోపీసుందర్ ట్యూన్స్‌ని అందించినా, రీ రికార్డింగ్ విషయంలో పలు కారణాలతో చేతులెత్తేశాడు. ఇదే సమయంలో సీన్‌లోకి థమన్ ఎంటర్ కావడం, ఆయన అందించిన బీజీఎం సినిమాలోని సన్నివేశాలకు జీవం పోశాయనే చెప్పాలి. మొత్తానికి ఈ మధ్య థమన్‌లో ఎంతో మార్పు కనిపిస్తోంది. వైవిధ్యభరితమైన చిత్రాలకు మంచి సంగీతం అందిస్తూ దూసుకుని వెళ్తున్నాడనే చెప్పాలి.