అదేమంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలు అంటారు. కానీ ప్రజలను కూడా భయభ్రాంతులని చేసే విధంగా రాచరికాన్ని తలపించేలా కొందరు హిట్లర్‌లా మారుతుంటారు. ఆ కోవలోకి వచ్చే సీఎం కేసీఆర్ అని స్పష్టంగా చెప్పవచ్చు. ఎంతటి వారైనా నేడు చంద్రబాబుని తిట్టడానికి ముందుకు వస్తున్నారేగానీ కేసీఆర్‌ని పల్లెత్తు మాట అనే సాహసం చేయలేకపోతున్నారు. కారణం హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ ఉండటం. అయితే హైదరాబాద్‌లో ఉన్న తమకి కేసీఆర్‌తో పనిఉన్నట్టే ఇండస్ట్రీ హైదరాబాద్‌లో ఉండటం కూడా కేసీఆర్‌కి అవసరం. కానీ మన సినీ పెద్దలు మాత్రం కేసీఆర్‌ని ఏమైనా అనాలంటే భయపడుతున్నారు.
తాజాగా పవన్ మాత్రమే ఫర్వాలేదనిపించాడు. కానీ స్వతహాగా మహా మొండి మనిషి, ఆవేశపరుడైన పవన్ కూడా కేసీఆర్‌ని నొప్పింపక తానొవ్వక అన్నట్లే మాట్లాడుతున్నాడు. ఆయన హైదరాబాద్‌లో జరిగిన యుద్దభేరి సభలో మాట్లాడుతూ, ఓ ఉద్యమనాయకునిగా కేసీఆర్ అంటే నాకు గౌరవం ఉంది. ఆంధ్ర ప్రజల కోసం చంద్రబాబుతో విభేదాలను కేసీఆర్ పక్కనపెట్టాలి. కేసీఆర్, చంద్రబాబుల మధ్య గొడవలతో ఏపీ ప్రజలు నలిగిపోతున్నారు. ఇంకా వాళ్లని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. నేను కేసీఆర్‌ని ఇబ్బందిపెట్టాలని ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. ఒకనాడు కేసీఆర్‌ని నా ముందు తిట్టిన వారు ప్రస్తుతం టిఆర్‌ఎస్‌లో ఉన్నారు.
ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాసయాదవ్ వంటి వారు నాడు కేసీఆర్‌ని నానా మాటలు అన్నవారే. వీరంతా ప్రజలకు, సమాజానికి సేవ చేసే వారు కాదు. తమ స్వార్థం కోసం పనులు చేసుకునే వారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన కేసీఆర్ కొన్ని కారణాల వల్ల ఆ పని చేయలేకపోయారు. కేసీఆర్ పాలన గురించి నేను తప్పుగా మాట్లాడటం లేదు. కానీ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా ఉండాలంటే ఎలా? మీరు చంద్రబాబుకి రిటర్న్‌గిఫ్ట్ ఇవ్వాలంటే హైదరాబాద్‌లోని ఆయన ఇంటిని సీజ్ చేసుకోండి. ఓటుకు నోటు కేసును తిరగదోడవచ్చు.
కానీ అవన్నీ పక్కనపెట్టి చంద్రబాబుని దెబ్బతీయడం కోసం జగన్‌కి మద్దతు ఇస్తే నేను నాడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడాల్సివుంటుంది. ఆంధ్రా పాలకులు వేరు. ఆంధ్రా ప్రజలు వేరు అని గుర్తించండి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికుండగా మిమ్మల్ని వెనక పది మంది లేకుండా ఏం ఉద్యమం చేస్తారని ఎగతాళి చేసిన విషయం గుర్తుంచుకోండి. మనుకోట రైల్వే స్టేషన్ జగన్ చేసిన దౌర్జన్యాన్ని మరిచారా? తిరుమలకు చెప్పులు వేసుకుని వచ్చిన వ్యక్తిని వెనకేసుకొచ్చి ఏపీ ప్రజలకు నష్టం కలిగించవద్దని పవన్ కోరడం ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది.