ఈమధ్య నాని-విక్రమ్ కె.కుమార్‌ల చిత్రానికి ‘గ్యాంగ్‌లీడర్’ అనే టైటిల్ పెడితే మెగాభిమానులు నానాహంగామా చేశారు. తమ హీరో టైటిల్‌ని రామ్‌చరణ్ మరీ కాకుంటే మరో మెగా కాంపౌండ్ హీరో పెట్టుకోవాలని, అంతేగానీ నాని పెట్టుకోవడం సరికాదని వాదన మొదలెట్టారు. చివరకు ఈ టైటిల్ మాదేనని మరో నిర్మాణ సంస్థ బయటకు వచ్చింది. మొత్తానికి ఈ వివాదం సమసి పోయింది అనుకునే లోపలే మరో మెగాస్టార్ టైటిల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 1986లో చిరంజీవి, రాధ, సుహాసిని కాంబినేషన్‌లో యండమూరి నవల ‘రాక్షసుడు’ ఆధారంగా అదే టైటిల్‌తో ఓ చిత్రం వచ్చి అద్భుతమైన సక్సెస్‌ని సాధించింది. ప్రస్తుతం ఈటైటిల్‌ను బెల్లకొండ సాయిశ్రీనివాస్ చిత్రానికి పెట్టాలని డిసైడ్ అయ్యారట.
ఈ చిత్రం తమిళ ‘రాచ్చసన్’ ఆధారంగా రీమేక్ అవుతోంది. రమేష్‌వర్మ దర్శకత్వం వహిస్తుండగా, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. నెగటివ్ టచ్‌లో విలన్‌ని సూచించే ఈ టైటిల్ పెట్టడం కంపల్సరీ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ టైటిల్ కథకి బాగా యాప్ట్ అయ్యే టైటిల్. చిరంజీవి ‘రాక్షసుడు’ చిత్రం తర్వాత సాయికుమార్ హీరోగా మరో ‘రాక్షసుడు’ చిత్రం వచ్చింది. అది ఎప్పుడు విడుదల అయిందో ఎప్పుడుపోయిందో కూడా తెలియదు.
ఇక కొంతకాలం కిందట సూర్య నటించిన ఓ తమిళ హర్రర్ చిత్రానికి తెలుగులో ఇదే టైటిల్‌ని పెట్టారు. ఇది కూడా బాగా ఆడలేదు. మొత్తానికి ఈ టైటిల్‌ని సాయిశ్రీనివాస్ నాలుగోసారి వాడుకుంటున్నాడన్నమాట. తేజ దర్శకత్వంలో హీరోయిన్ కాజల్ పేరు మీద ‘సీత’ అనే టైటిల్‌తో ఓ చిత్రం చేస్తోన్న బెల్లంకొండ బాబుకి ఈసారి విలన్‌ని సూచించే టైటిల్‌ని పెట్టడం విశేషం. ఈ విషయంలో హీరో తానే కాబట్టి తన పేరు మీదనే టైటిల్ ఉండాలని గట్టి పట్టు పట్టకుండా కాస్త సంయమనం చూపిస్తున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ని మెచ్చుకోవాల్సిందే...!