టిడిపితో జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ రహస్య అవగాహన కుదుర్చుకున్నాడని గత కొంతకాలంగా వైసీపీ నేతలు విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇటీవల వైసీపీ ముఖ్యనాయకుడు విజయ్‌సాయిరెడ్డి ఓ ప్రకటన చేశాడు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పోటీ చేస్తోన్న వైజాగ్‌లోని గాజువాక, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం చేసి పవన్‌కళ్యాణ్‌పై విమర్శలు చేయాలని ఆయన డిమాండ్ చేశాడు.
ఈ విషయంపై పవన్ స్పందిస్తూ, అసలు ఎవరేం చేయాలో చెప్పడానికి విజయసాయిరెడ్డి ఎవరు? ఆయన పని ఆయనను చూసుకోమనండి. ఏ పార్టీ ఎలా ఉండాలో చెప్పడానికి విజయసాయిరెడ్డి, జగన్, చంద్రబాబులు ఎవరు? పిచ్చి మాటలు మాట్లాడే వారికి కాలమే సమాధానం చెబుతుంది. చంద్రబాబు, జగన్‌లకు ఊడిగం చేయకపోతే వారు ఎవరినైనా అవకాశ వాదిగానే చిత్రీకరిస్తారు. మేమేంటో ‘ఈ ఇద్దరికి చూపిస్తాం’ అంటూ ఘాటుగా స్పందించాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, డబ్బున్న వాళ్లే కాదు... చాలా సామాన్యులు కూడా రాజకీయాలలోకి రావాలి. కష్టాలు, ఆకలి, జీవిత భారం తెలిసిన వారే రాజకీయ నాయకులు కావాలి. అందుకే అలాంటి వ్యక్తులనే నిలబెట్టాం. కష్టపడకుండా ఏదీ రాదు. కష్టాన్ని బలంగా నమ్మే వ్యక్తిని నేను. టీడీపీ జనసేనతో కుమ్మక్కయిందని, అందుకే పలుచోట్ల జనసేన డమ్మి అభ్యర్దులను నిలబెట్టిందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఫలానా వారు డమ్మీ అభ్యర్థి అని మీరెలా నిర్ణయిస్తారు? పీహెచ్‌డి, సిఏ చదివిన వారిని, కార్యకర్తల నుంచి నాయకుడుగా ఎదిగిన వ్యక్తిని డమ్మీ అభ్యర్థి అని అహంకార పూరితంగా ఎలా మాట్లాడుతారు? ఎవరైనా సరే ఆ పదప్రయోగాన్ని మార్చుకోవాలి. పోటీ చేసే అభ్యర్ధులకు వేల కోట్లు ఉండాలా? ఉన్నత వర్గాలకు చెందిన వారే అయి ఉండాలా? అని పవన్ ప్రశ్నించారు.