త్వరలో జరగనున్న పార్లమెంట్ లోక్‌సభ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టిడిపి, వైసీపీ, జనసేన పార్టీలు ప్రచార చిత్రాలతో పాటు ప్రచార గీతాలతో కూడా హోరెత్తిస్తున్నాయి. వీటిని సినిమా రంగానికి చెందిన వారు నిర్మించడం వల్ల ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ‘గిర్రా గిర్రా తిరుగుతోంది ఫ్యాన్.. నేను జగనన్న ఫ్యాన్’,‘నేను విన్నాను.. నేనున్నాను, రావాలి జగన్-కావాలి జగన్’ అంటూ వైసీపీ ఓ మోత మోగిస్తూ ఉంటే... చంద్రబాబుకి సంబంధించిన టీడీపీ కూడా ఇదే బాటలో దూసుకుని పోతోంది.
తాజాగా టిడిపి విడుదల చేసిన ‘శిల మోసే గాయాలే కావా శిల్పాలు’ గీతం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘నిన్ను చీల్చినా నీ వెన్ను వణకదు. నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు. చంద్రన్నా.. చంద్రన్నా.... నీవు చెమ్మగిల్లనీయవు ఏ కళ్లయినా’ అనే పాట చాలా బాగా ఉందనే ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక తాజాగా చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో మోదీపై విరుచుకుపడ్డాడు. రాష్ట్ర ప్రగతిని మోదీ అడ్డుకున్నారు. విశాఖ రైల్వేజోన్ ఇచ్చినా దాని ప్రయోజనాలు పరిమితం. విశాఖ విమానాశ్రయం ప్రగతిని అడ్డుకున్నాడు. భోగాపురం విమానాశ్రయానికి గండి కొట్టారు. విశాఖపట్టణం ఎయిర్‌షోని చివర నిమిషంలో అడ్డుకున్నాడు. ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకునే నీచమనస్తత్వం మోదీది. మోదీ మనసు నిండా అసూయ, ద్వేషాలుంటాయి. ఆయన ఏనాడు చేసేది చెప్పరు. చెప్పింది చేయరు. ఈ ఎన్నికల్లో ఏపీలో ఆయనకు ఒక్క ఓటు కూడా పడదు. మోదీ ఓటమి ఖాయమని చంద్రబాబు వ్యాఖ్యానించాడు.
ఇక ఇదే వేడుకలో తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, మోదీని తీవ్రంగా విమర్శించారు. ఆమె మాట్లాడుతూ, మోదీ కారణంగా దేశం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోం. దేశానికి మోదీ, షాలు అవసరం లేదు. వారి వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదు. ఐదేళ్ల పాలనలో మోదీ ఐటి దాడులు మాత్రమే చేయంచారు. పెద్ద నోట్ల రద్దు వల్ల తీవ్రవాదం తగ్గిపోతుందని అన్నారు. కానీ అది జరగలేదు. దమ్ముంటే ప్రధాని మోదీ నాతో చర్చకు రావాలి. పేపర్లు, టెలీ ప్రాంప్టర్లు లేకుండా చర్చకు దిగాలి. ఈ ఎన్నికలే మోదీకి చివరివి. బిజెపికి 125 సీట్లుమించి రావు. మోదీతో యుద్దానికి నేను సిద్దంగా ఉన్నానని మమతా బెనర్జీ సవాల్ విసిరింది.