పోసాని.. ఈయనది ఓ విలక్షణ వ్యక్తిత్వం. ప్రతి ఎన్నికల ముందు ఆయన సందడి చేస్తూ ఉంటాడు. అలాగని ఎప్పుడు ఒకే పార్టీకి మద్దతు ఇవ్వడు. రాజశేఖర్‌రెడ్డితో చంద్రబాబు పోటీ పడుతున్న సమయంలో చంద్రబాబుకి ఓటేయండి.. అంటూ దానికి గల కారణాలను ఏకంగా దినపత్రికల్లో ఫుల్‌పేజీ యాడ్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఈసారి ఆయన జగన్‌కి మద్దతు తెలుపుతున్నాడు.
ఇక మరో నటుడు అలీ గురించి కూడా చెప్పాలి. అటు తన స్నేహితుడైన జనసేనాని పవన్‌ని కలిశాడు. చంద్రబాబుని కలిసి చివరకు వైసీపీ జెండా భుజాన వేసుకున్నాడు. తనకి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి కావాలనేది తన కోరిక అని తెలిపాడు. కానీ ఎవ్వరినీ సరిగా నమ్మకపోవడం వల్ల ఆయనకు కనీసం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా దక్కలేదు. అత్యాశకి పోతే ఏమి జరుగుతుందో అది అలీ విషయంలో నిరూపితం అయింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఒకరిని ఒకరు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఇక విషయానికి వస్తే పోసాని తెరకెక్కిస్తున్న ‘ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు’ సినిమా టైటిల్ ఆవిష్కరణలో అలీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకి తెలిసిన పోసాని గురించి చెప్పుకొచ్చారు. పోసాని ఎందరికో సాయం చేసినా వాటిని ఆయన బయటకు చెప్పుకోడు. గుప్తదానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మాటలు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడ చెప్పేరకం కాదు. షూటింగ్‌కి వస్తే తన పని తాను చేసుకుని పోయే రకం ఆయన. పోసాని మంచి మనసును మెచ్చి భగవంతుడు ఆయనకు ‘నాయక్’ చిత్రంతో బ్రేక్ ఇచ్చాడు. అక్కడి నుంచి కమెడియన్‌గా పోసాని ప్రస్థానం అందరికీ తెలిసిందే.
కానీ ఇప్పుడున్న కమెడియన్లలో పోసాని స్థానం కంటే ఆయన వ్యక్తిత్వం ఎంతో గొప్పది. ఆయన నిర్మాతగా చేసి ఉన్నదంతా పోగొట్టుకున్నారు. అయినా ఆర్టిస్టులందరికీ పారితోషికాన్ని ఇచ్చాడే గానీ ఎవ్వరికీ ఆపలేదు. ఎవ్వరికీ పారితోషికం ఎగ్గొట్టని గొప్ప మనిషి పోసాని అంటూ అలీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే వైసీపీకి చెందిన ఇద్దరు తమ గురించి తాము గొప్పగా చెప్పుకోవడానికి ఈ వేదికను ఉపయోగించుకున్నారని చెప్పవచ్చు.