తెలుగులో ఎప్పుడూ పరభాషా హీరోయిన్లు, విలన్ల హవా సాగుతూనే ఉంటుంది. ఇదే సమయంలో కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఏ మాత్రం పొరపాటు చేసినా కెరీర్ పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక విషయానికి వస్తే మలయాళ కుట్టిగా పేరు తెచ్చుకున్న చికాగో భామ అను ఇమ్మాన్యుయేల్. 2011లో మలయాళంలో ‘స్వప్నసంచారి, యాక్షన్ హీరో బిజ్జూ’ చిత్రాలలో నటించింది. తెలుగులోకి ‘మజ్ను’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత టాలీవుడ్‌లో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా, శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాలతో పాటు కోలీవుడ్‌లో విశాల్ సరసన ‘తుప్పరివారన్’ మూవీలో నటించింది. అందం, నటన, ప్రతిభ, ముక్కు తీరు అద్బుతంగా ఉండే ఈమె సరైన హిట్ రాకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి.
తాజాగా ఈమె మాట్లాడుతూ, కెరీర్ తొలినాళ్లలో వరుసగా గ్లామర్‌పాత్రలు చేసుకుంటూ వెళ్లాను. అదే సమయంలో నాకు పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలు చేసి తప్పు చేశాను. ఆ కారణంగానే కెరీర్‌లో బాగా వెనుకబడిపోయాను. ఇకపై కథల విషయంలో, నాపాత్రల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటాను. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రల్లోనే నటిస్తాను.. రాబోయే రోజుల్లో మీరే నాలోని మార్పుని తప్పకుండా చూస్తారు అని చెప్పుకొచ్చింది. మొత్తానికి నటన, అందం, గ్లామర్ వంటివి ఉన్నా గోరంత అదృష్టం కూడా తోడవ్వాలి. ఆ అదృష్టమే ఇంత వరకు అను ఇమ్మాన్యుయేల్‌కి కలిసి రావడం లేదనే చెప్పాలి. మరి భవిష్యత్తులో అయినా ఈమె స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందో లేదో వేచిచూడాల్సివుంది...!