గత రెండు నెలల ఉత్కంఠకి ఫైనల్‌గా తెర పడింది. రామ్ గోపాల్ వర్మ అనుకున్నది సాధించాడు. కానీ ఏపీ సర్కార్ మొత్తానికి ఎలాగోలా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కాకుండా అడ్డు కట్ట వేసి.. వర్మకి షాకిచ్చింది. ఏపీ హైకోర్ట్ నుండి స్టే తెచ్చి మరీ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ని ఆపేసింది ఏపీ ప్రభుత్వం. కానీ తెలంగాణలోనూ, ఓవర్సీస్ లోను లక్ష్మీస్ ఎన్టీఆర్ షోస్ యధావిధిగా పడుతున్నాయి. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీమియర్స్ పూర్తి చేసుకుంది. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీమియర్స్ టాక్ ఏమిటంటే.. రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు మీద కక్ష తీర్చుకోవడానికే లక్ష్మీస్ ఎన్టీఆర్ ని తెరకెక్కించాడనే ఏదైతే మీడియాలో చాలా రోజులుగా ప్రచారం జరిగిందో.. అది లక్ష్మీస్ ఎన్టీఆర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్ధమవుతుంది. నిజంగానే చంద్రబాబు మీద వర్మ ఇంతగా పగ పట్టాడా అని.
అడుగడుగునా బాబుని విలన్‌గా చేసి చూపించాడు. ఇక లక్ష్మి పార్వతి మీద సాఫ్ట్ కార్నర్ కలిగేలా.. ఎన్టీఆర్ ఆత్మ క్షోభను చూపించాడు వర్మ. సినిమా మొదలవడమే లక్ష్మి పార్వతి... ఎన్టీఆర్ మీద ఆత్మకథ రాస్తానంటూ ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎంటర్ అవడం.. తర్వాత ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి మధ్య పరిచయం, వారిమధ్యన అన్యోన్యతని ఫస్ట్ హాఫ్ లో చూపించాడు. ఇక తర్వాత సెకండ్ హాఫ్ లో చంద్రబాబు వెన్నుపోటు, ఎన్టీఆర్ మీద నందమూరి ఫ్యామిలీ తిరుగుబాటు, వైస్రాయ్ ఉదంతం, ఎన్టీఆర్ పదవిని కోల్పోవడం వంటి వాటిని చూపించిన వర్మ.... లక్ష్మి పార్వతికి - ఎన్టీఆర్ కి మధ్యన ఉన్న అనుబంధాన్ని మాత్రం చాలా చక్కగా చూపించాడు.
రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మొత్తం చంద్రబాబు, నందమూరి ఫ్యామిలీ, లక్ష్మి పార్వతి, ఎన్టీఆర్ ల మీద కథ నడిపించాడు. కాకపోతే సినిమా మొత్తం చంద్రబాబు మీద ప్రతీకారంతోనే సినిమాని వర్మ తీసాడా అనిపిస్తుంది సగటు ప్రేక్షకుడికి. ఇక నటీనటులు మాత్రం తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు పాత్రధారి శ్రీతేజ్ అద్భుతంగా నటించాడు. ఇంకా కళ్యాణ్ మాలిక్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.