ఈనెల 29వ తేదీన మెగాడాటర్ కొణిదెల నిహారిక ప్రధానపాత్రలో రాహుల్ విజయ్ నటిస్తున్న ‘సూర్యకాంతం’ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. నిహారిక సోదరుడు మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రణీత్ దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ పరంగానే కాకుండా టీజర్ ద్వారా కూడా అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీని ఏకంగా దిల్‌రాజు పంపిణీ చేస్తూ ఉండటం, ఎఫ్2, 118 తర్వాత ‘సూర్యకాంతం’తో తాను హ్యాట్రిక్ కొట్టనున్నానని, ఆల్‌రెడీ ఈ చిత్రాన్ని చూశానని చెప్పిన దిల్‌రాజు, నిహారిక, రాహుల్ విజయ్‌ల మీద ప్రశంసలు కూడా కురిపించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ యూత్‌ని, ఫ్యామిలీ ఆడియన్స్‌ని మరింతగా ఆకట్టుకునేలా, సినిమాపై మంచి అంచనాలను పెంచేలా సాగడం విశేషం. ఈ చిత్రం కాన్సెప్ట్‌ని ట్రైలర్‌లో బయటపెట్టారు. సూర్యకాంతం, పూజా అనే ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే యువకుడైన అభి పాత్రలో రాహుల్ విజయ్ నటిస్తున్నాడు. ప్రధాన పాత్రలకి సంబంధించిన సన్నివేశాలతో ఈ చిత్రం ట్రైలర్‌ని కట్ చేశారు. లవ్, కామెడీ, ఎమోషన్స్‌ని చూపిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందనే చెప్పాలి. ఈ సినిమాకి టైటిల్ పాత్రను పోషిస్తోన్న ‘సూర్యకాంతం’ పాత్రధారి నిహారిక మెయిన్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఇప్పటివరకు సరైన హిట్ లేని మెగాడాటర్‌కి ఈ చిత్రం అయినా మంచి విజయం అందిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది.
ఇక ఈనెల 29నే విడుదల కానున్న రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం కూడా విడుదల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్, సూర్యకాంతం’ చిత్రాలు పూర్తిగా విరుద్దమైన జోనర్స్‌కి చెందినవి కావడం విశేషం. అయినా ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ‘సూర్యకాంతం’ కంటే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’దే పైచేయి అయ్యే అవకాశాలు ఉన్నాయి.