ఏ చిత్రమైనా సరే దిల్‌రాజు చేతుల్లో పడిందంటే దాని రేంజ్ మారిపోవడం గ్యారంటీ. కానీ గత ఏడాది ఈయనకు పెద్దగా కలిసిరాలేదు. ఆయన నిర్మించిన శ్రీనివాసకళ్యాణంతో పాటు, రాజ్‌తరుణ్ కూడా ఆయనకు డిజాస్టర్‌ని ఇచ్చాడు. దీంతో దిల్‌రాజు మరింత ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. నిర్మాతగానే కాకుండా పంపిణీ దారునిగా కూడా తన సత్తా మరలా చాటాలని తపన పడుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి ఆయన నిర్మాతగా వచ్చిన ‘ఎఫ్ 2’ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్ అయింది. ఆ తర్వాత గుహన్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన ‘118’ హక్కులను తీసుకున్నాడు. ఇది కూడా మంచి లాభాలనే అందించింది.
ప్రస్తుతం ఆయన ప్రణీత్ దర్శకత్వంలో మెగాడాటర్ కొణిదెల నిహారిక నటిస్తున్న ‘సూర్యకాంతం’ హక్కులను కూడా సొంతం చేసుకున్నాడు. ఈనెల 29న విడుదల కానున్న ఈ చిత్రం ద్వారా తొలిహిట్‌ని ఖాతాలో వేసుకోవాలని నిహారిక భావిస్తోంది. ఈ చిత్రం నైజాం హక్కులను దక్కించుకున్న దిల్‌రాజు ఈ చిత్రంపై ఎంతో నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాని చూశాను, నిహారిక నటన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నిహారికతో పాటు రాహుల్ విజయ్ నటన కూడా చాలా బాగుంది. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే వాడిగా రాహుల్ విజయ్ ఆకట్టుకున్నాడు. రాహుల్ విజయ్ నటించిన మొదటి చిత్రాన్ని ప్రమోషన్ చేయమని నన్ను ఎంత అడిగినా నేను చేయలేదు.
‘సూర్యకాంతం’ చూసిన తర్వాత మాత్రం ఆయన పెద్ద నటుడు అవుతాడనే నమ్మకం కలిగింది. ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు అని నేను చెప్పడం లేదు. అతడిలో మంచి నటుడు ఉన్నాడు. అందుకే అతడిని ప్రోత్సహిస్తున్నాను. మొత్తానికి దిల్‌రాజు ఈ చిత్రాన్ని చూసి మరీ నిహారిక, రాహుల్ విజయ్‌లకు ఆశీర్వాదం ఇవ్వడం, ‘సూర్యకాంతం’తో తాను హ్యాట్రిక్ కొట్టనున్నానని తెలపడం చూస్తుంటే ఈ చిత్రంపై మెల్లిగా అంచనాలు ఏర్పడుతున్నాయి.