మోహన్‌బాబుకి చెందిన శ్రీ విద్యానికేతన్‌కి చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్ డబ్బులు ఇవ్వడం లేదని తాజాగా మోహన్‌బాబు దీక్షకు కూర్చోవడం సంచలనంగా మారింది. ఈ దీక్షలో మంచు మనోజ్ కూడా పాల్గొన్నాడు. మంచు విష్ణు తాము చెప్పిన డబ్బుల కంటే రూపాయి ఎక్కువ అడిగామని నిరూపిస్తే తన ఆస్థిని మొత్తం రాసిస్తానని చంద్రబాబుకి ఓపెన్ చాలెంజ్ విసిరాడు. మరోవైపు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, మోహన్‌బాబుని పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు.
తాజాగా దీనిపై స్పందించిన మంచు మనోజ్ మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యాడు. తమ ప్రతి రూపాయి కష్టార్జితం అని, ఆయా ఫీజులకి సంబంధించిన కాగితాలను కూడా ట్విట్టర్‌లో పెట్టాడు. ఈ సందర్భంగా మనోజ్ పలువురు నెటిజన్లు వేసిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పాడు. పవన్‌కళ్యాణ్‌కి మద్దతిస్తావా? అని ఓ అభిమాని అడిగితే ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పాడు. మరో అభిమాని రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తే మద్దతు ఇస్తావా? అని ప్రశ్నించాడు. దానికి మనోజ్ సమాధానం ఇస్తూ, తారక్ అంటే నాకు ప్రాణం. నా ప్రాణాలైనా అతడి కోసం ఇస్తానని సమాధానం ఇచ్చి ఇటు పవన్, అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మనసు దోచుకున్నాడు.
మరోవైపు దాసరి కోడలు సుశీల, మోహన్‌బాబుపై తీవ్ర ఆరోపణలు చేసింది. మోహన్‌బాబు దాసరి మనవడుకి అన్యాయం చేశాడు. దాసరి ఆస్తులు సమంగా పంచుతానని చెప్పి సడన్‌గా మరణించారు. దాంతో మోహన్‌బాబు జోక్యం చేసుకుని తాను పెద్ద మనిషిగా సమస్యను పరిష్కరిస్తానని మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం దాసరి మనవడు.. నా కుమారుడిని మోసం చేశాడు. కేవలం నా మరిది దాసరి అరుణ్‌కుమార్‌కి లబ్ది చేకూర్చేందుకే మోహన్‌బాబు ఇలా చేస్తున్నాడని ఆరోపణలు చేసింది. ఇక దీనిపై మరోసారి మోహన్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
ఆయన చంద్రబాబుని టార్గెట్ చేస్తూ తీవ్ర పదజాలంతో.. ఫీజు రీఎంబర్స్‌మెంట్ అడిగితే కక్ష్యసాధింపు మొదలుపెట్టాడు. ఆ గ్రేట్ అబద్దాల కోరు గురించి మాట్లాడాలంటే ఒక గ్రంధం అవుతుంది. ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ఆయన్ని ఎంతో గౌరవించి మా విద్యాసంస్థల వేడుకలకు అతిథిగా పిలిచాను. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఎంతో గొప్పవాడిని అనుకుంటున్నాడు. ప్రజలిచ్చిన అధికారంతో గొప్ప అనుకుంటే ఎలా? ప్రభుత్వం నీది కాబట్టి కొందరు బ్రోకర్లు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్లెవరూ కాకుండా డైరెక్ట్‌గా నువ్వే వచ్చేయ్... ఓపెన్‌గా తేల్చుకుందాం.. అంటూ ఓ లేఖని మోహన్‌బాబు విడుదల చేశాడు.