ప్రస్తుతం ఆంధ్రాలో ఎన్నికల ఫీవర్ నడుస్తుంది. అక్కడ టిడిపి, వైసిపి హోరా హోరి యుద్దానికి తలపడుతున్నాయి. మధ్యలో అంటే అడకత్తెరలో పోక చెక్కలా పవన్ కళ్యాణ్ జనసేనని దింపుతున్నాడు. టిడిపి, జనసేన, వైసిపి మాటల యుద్ధంతో మీడియా మొత్తం మార్మోగిపోతోంది. ఇక ఈసారి టిడిపికి సినిమా గ్లామర్ దూరమైంది. కానీ వైసిపికి మాత్రం టాప్ కమెడియన్స్ మద్దతునిస్తున్నారు. ఇక జనసేన సినిమా గ్లామర్ పార్టీనే. పవన్ కళ్యాణ్ టాప్ మోస్ట్ హీరోగా వున్న టైంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. మరి అన్నగారు ప్రజారాజ్యం పార్టీతో సాధించలేనిది.. జనసేనతో సాధిస్తాను.. ఒక్కసారి సీఎం పదివి ఇవ్వండి అంటూ ప్రజలను ఓట్లు అడుగుతున్నాడు. మరి అన్నగారు పార్టీ పెట్టినప్పుడు.. ఆ ఎన్నికల కోసం మెగా ఫ్యామిలోని హీరోలే కాదు.. ఫ్యామిలీ ఫ్యామిలీ రోడ్డుమీదకొచ్చింది.
కాని ఈసారి ఈ ఎన్నికల్లో మెగా హీరోలవారు పవన్ కళ్యాణ్ పక్షాన నిలబడేటట్లు కనిపించడం లేదు. ఇంకా ఎన్నికల రోజుకి కేవలం 16 రోజుల టైం మాత్రమే ఉంది. ఏదో బాలకృష్ణని టార్గెట్ చేస్తూ వీడియోస్ రూపంలో గలాటా చేసిన నాగబాబు నిన్నగాక మొన్న జనసేనలోకి చేరి నర్సాపురం ఎంపీ టికెట్ సంపాదించాడు. గతంలో ఫ్యాన్స్ మెగా ఫ్యామిలి పవన్ ఏడంటూ అడిగినప్పుడు.... వాడి గురించి నాకు తెలియదని విసుక్కున్న నాగబాబుకు ఈ రోజు తమ్ముడు పవన్ గుర్తొచ్చాడు. కారణం ఎంపీ టికెట్. సరే అదలా ఉంటే.. రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కి మద్దతిస్తున్నాని అన్నాడు కానీ..... ప్రస్తుతం చడీ చప్పుడు లేదు. RRR షూటింగ్ తో పొరుగు రాష్ట్రం వెళ్ళిపోయాడు. ఇక చిరంజీవి సై రా షూటింగ్ లో బిజీ. అటు కాంగ్రెస్ వాళ్ళకి కూడా చిరు దొరకడం లేదు. గత ఎన్నికల్లోనే చిరు గాయబ్. అసలు తమ్ముడు జనసేనపై చిరు స్పందన కరువు.
మరోపక్క వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లాంటి మెగా హీరోలు కూడా జనసేనపై స్పందించడానికి జంకుతున్నారు. మరి మెగా హీరోల గ్లామర్ జనసేనకు అందనట్టే కనబడుతుంది. నాగబాబు ఒక్కడే పవన్ కళ్యాణ్ భజన చెయ్యాల్సిన పరిస్థితి. మరి రెండు చోట్ల బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ క్రేజ్ తో ఎలాగో తన సీట్స్ లో గెలిచేస్తాడేమో కానీ.. మిగతా అభ్యర్థుల సంగతి ఎలా ఉంటుందో చెప్పలేం. ఇక మెగా ఫ్యామిలీ రాకపోతేనే బెటర్ అన్నట్టుగా పవన్ కూడా ఉంటున్నాడు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ అప్పుడు మెగా హీరోలు అందరూ దిగినా పని జరగలేదు. అందుకే ఈసారి కావాలనే దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.