ఈమధ్య రవితేజకి వరుసగా అపజయాలే వస్తున్నాయి. మధ్యలో ‘రాజా ది గ్రేట్’ తప్ప చెప్పుకోవడానికి మరో చిత్రం లేదు. ‘టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోని’ వంటి వరుస డిజాస్టర్స్ వచ్చి ఆయన ఖాతాలో చేరాయి. దాంతో కథలు, దర్శకులు, స్క్రిప్ట్ విషయంలో మాస్ మహారాజా చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ అనే చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాకుండానే సమాంతరంగా మరో చిత్రాన్ని చేయడానికి ఆయన సిద్దమయ్యాడు.
చాలాకాలంగా చర్చల్లో ఉన్న విజయ్ నటించిన తమిళ తేరీ రీమేక్‌ని కందిరీగ ఫేమ్ సంతోష్‌శ్రీనివాస్‌తో చేయడానికి ఓకే చెప్పడమే కాదు.. త్వరలో పట్టాలెక్కించనున్నాడు. ఈచిత్రం కోసం ‘కనకదుర్గ’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. తేరీకి తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేశారు. మొదట ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సంతోష్ శ్రీనివాస్ దర్శకునిగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ చేయాలని భావించాడు. కానీ ఎన్నికలు దగ్గరపడిన వేళ ఆయన రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఈ చిత్రం చేయలేకపోయాడు. ఎక్కువశాతం పవన్ నో చెప్పిన చిత్రాలే రవితేజకి బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచి, కెరీర్‌పరంగా ఆయన ఈ స్థాయికి రావడానికి దోహదపడ్డాయి.
దాంతో తేరీ రీమేక్‌గా రూపొందనున్న ‘కనకదుర్గ’ కూడా రవితేజకి భారీహిట్‌ని ఇస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. విఐ ఆనంద్ ‘డిస్కోరాజా’తో పాటు ‘కనకదుర్గ’ని కూడా ఇదే ఏడాది విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ‘కనకదుర్గ’ని మైత్రి మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా, ఇందులో కాజల్ అగర్వాల్, కేథరిన్ లను ఎంపిక చేశారని సమాచారం. ఇతర విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.