ఒకవైపు వైసీపీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి బంధం ఏర్పడింది. జగన్‌ని ఎలాగైనా ఏపీ సీఎం చేయాలని, ఆ విధంగా తాము చంద్రబాబు నాయుడుకు రిటర్న్‌గిఫ్ట్ ఇస్తామని, ఆ గిఫ్ట్ ఏంటో ఎన్నికలు ముగిశాక తెలుస్తాయని తెలంగాణ టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబుకి వ్యతిరేకంగా బిజెపి, మజ్లిస్ పార్టీలు కూడా ఏకం అయ్యాయి. అయితే ఏపీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్, ఒవైసీలు ఎన్నికల ప్రచారం చేస్తే బాబు నెత్తిన పాలు పోసినట్లేనని చెప్పాలి. వారిద్దరు ఏపీలో ప్రచారం చేస్తే వారికి, వారు మద్దతు ఇస్తున్న వైసీపీకి పుట్టగతులు ఉండవు.
మరోవైపు టిడిపికి, జనసేనకి మధ్య రహస్యఒప్పందం జరిగిందనే అంటున్నారు. నారా లోకేష్ పోటీ చేస్తోన్న మంగళగిరి నియోజకవర్గాన్ని వామపక్షాలకు కేటాయించింది అందుకేనని చర్చ సాగుతోంది. మరోవైపు టిడిపిలో సీట్లు దక్కని వారు, అసమ్మతి నేతలు జనసేనలో చేరుతున్నారు. తాజాగా గంటా శ్రీనివాసరావు సమీప బంధువు పార్టీలో చేరాడు. విశాఖపట్టణం మాడుగుల నియోజకవర్గంలో కూడా పరిస్థితి ఇదేనని అంటున్నారు. ఇక్కడి నుంచి టీడీపీ తరపున జి.రామానాయుడు పోటీ చేస్తున్నాడు. అదే రామానాయుడు సోదరుడు సన్యాసి నాయుడుకి జనసేన టిక్కెట్ ఇచ్చింది. ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపి, పార్టీ విజయంపై ప్రభావం చూపుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు.
ఇక సత్తెనపల్లి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక్కడ వైసీపీ నుంచి కిందటిసారి ఓటమి పాలైన అంబటిరాంబాబు పోటీ చేస్తున్నాడు. ఇతను కూడా పవన్ సామాజిక వర్గమే. ఆయనకు పోటీగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోడెల శివప్రసాద్ పోటీలో ఉన్నాడు. ఈ సారి ఈ సీటులో పోటాపోటీ పోరు జరగనుంది. అదే సమయంలో ఇదే నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక ఓట్లను దృష్టిలో పెట్టుకున్న జనసేనాని ఎర్రం వెంకటేశ్వరెడ్డిని బరిలోకి దింపాడు. ఈయన జనసేనలోకి వచ్చే ముందు కోడెలను కలిసి మరీ రావడం విశేషం.
ఇక మరోవైపు జగన్ కూడా తన ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను కేటాయించడంలో కేసీఆర్ సలహాలు తీసుకుంటున్నాడట. టిడిపిలో ఆర్థికమూలాలు కలిగి, పార్టీకి ఆర్ధికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్న నేతలు హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేసుకుంటూ ఉంటే వారిని నయానభయానా బెదిరించి, వారిని పార్టీలో చురుకైన పాత్రను పోషించకుండా కట్టడి చేస్తున్నాడు. ఇక జగన్‌కి, బిజెపికి మధ్య ఉన్న స్నేహం కూడా బట్టబయలు అవుతోంది. బిజెపి ముఖ్యనాయకులు పోటీ చేసే స్థానాలలో వైసీపీ బలహీనమైన అభ్యర్ధులను నిలబెడుతోందనే వార్తల్లో కూడా నిజం ఉంది. ఇలా చూసుకుంటే ఏపీ రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో తెలియని పరిస్థితి ఏర్పడుతోందనే చెప్పాలి.