గత రెండు నెలలుగా సినిమా థియేటర్స్ అన్ని బోసిపోతున్నాయి. సినిమాలకు బిగ్ డేస్ అయిన సంక్రాంతి పండగ నెల మొత్తంలో భారీ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చినా.. కేవలం ఒకే ఒక్క సినిమా మాత్రం హిట్ అయ్యింది. ఆ సినిమాకి వేరే సినిమాలు పోటీ లేక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అదే ‘ఎఫ్ 2’. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఇప్పటివరకు భారీ హిట్ కొట్టిన చిత్రం. ఇక ఫిబ్రవరి నెల కూడా సో సో గానే నడించింది. యాత్ర సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా..అది రాజకీయాలకు సంబందించిన సినిమా గనక అన్ని వర్గాల ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక ఈ మార్చి మొదటి రోజే కళ్యాణ్ రామ్ 118 సినిమాతో బోణి కొట్టాడు. ఆ సినిమా హిట్ అయ్యింది కానీ.. పిల్లలకు ఎగ్జామ్స్ ఫీవర్ తో థియేటర్స్‌లో ప్రేక్షకులు కనబడితే ఒట్టు.
ఇక మార్చి 1 న 118 వస్తే.. తర్వాత వారం ఏ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.. అలాగే గత వారం కూడా సినిమాలు వచ్చాయి వెళ్లాయి. కానీ సినిమా లవర్స్ ని ఏ సినిమా మెప్పించలేకపోయింది. ఇక రాబోయే శుక్రవారం కూడా డబ్బింగ్ సినిమాలు, చిన్న సినిమాలు విడుదల అంటున్నారు కానీ.. ఎక్కడా ప్రమోషన్స్ లేక.. అసలే సినిమా థియేటర్ లోకొస్తుందో కూడా ప్రేక్షకుడికి క్లారిటీ లేదు.
గత రెండు నెలలుగా బాక్సాఫీసు దగ్గర టికెట్స్ కొనే నాధుడు లేక థియేటర్స్ అన్ని వెలవెలబోతున్నాయి. అయితే ఈ శుక్రవారం వస్తుందనుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం కాస్త ఆసక్తితో ప్రేక్షకులు వెయిట్ చేశారు. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా ఈ నెల 29కి వాయిదా పడింది. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ వచ్చేవరకు ప్రేక్షకుడు ఈ బోర్‌ని భరించాల్సిందే.