నాగచైతన్య, సమంతల వివాహం జరిగిన కొద్ది రోజుల్లోనే ‘రాజు గారి గది 2’ విడుదలైంది. ఈ సందర్భంగా మామ నాగార్జునతో కలిసి సమంత ప్రమోషన్స్ చేసింది. ఇందులో ఫ్యామిలీ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి సగటు ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేశారు మామా కోడళ్లు. ఇప్పుడు కూడా భార్యాభర్తలు సమంత-నాగచైతన్యలు కూడా అదే తరహాలో ప్రమోషన్స్ సాగిస్తున్నారు. పెళ్లికి ముందు ‘ఏ మాయచేశావే, మనం, ఆటోనగర్ సూర్య’ వంటి చిత్రాలలో నటించిన ఈ జంట ప్రస్తుతం వివాహం తర్వాత తొలిసారిగా కలిసి నటిస్తున్నారు. వీరిద్దరు కలిసి నటించిన ‘మజలీ’ చిత్రం ఏప్రిల్5న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రం కోసం వారిద్దరు కలిసి ప్రచారం చేస్తు, తమ మాటలకే గిమ్మిక్కులు చేసి అందరి అటెన్షన్‌ని సాధిస్తున్నారు. షేన్‌స్క్రీన్స్ బేనర్‌లో ‘నిన్నుకోరి’ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మజలీ’ నుంచి తాజాగా ఓ లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘యేడెత్తు మల్లెలే.. కొప్పులో చేరే దారే లేదే.. నీ తోడు కోయిలే పొద్దుగూకే వేళ కూయలేదే’ అంటూ సాగిన ఈ సాంగ్‌కి గోపీసుందర్ మంచి ట్యూన్ అందించాడు. శివనిర్వాణ సొంతగా సాహిత్యం అందించగా, కాలభైరవ-నిఖిల్ గాంధీలు శ్రావ్యంగా ఆలపించారు. ఈ చిత్రంలో దివ్యాంశకౌశిక్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అటు యూత్‌ని, ఇటు ఫ్యామిలీస్‌ని ఆకట్టుకునేలా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్ సందర్భంగా సమంత, నాగచైతన్యల మధ్య జరిగిన కొన్ని మాటల యుద్దాలు కొంటె కాపురం చేస్తోన్న ఈ యువజంట అభిమానులను ఆకర్షిస్తున్నాయి.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, చైతు గురించి నాకంటే ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు. అలాగే నా గురించి చైతుకి తప్ప మరెవ్వరికి ఎక్కువగా తెలియదు. అలా మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ పెరిగింది... అంటూ చెప్పుకొచ్చింది.
నాగచైతన్య మాట్లాడుతూ, ఎవరికైనా పెళ్లయిన ఏడాది వరకే హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత అంతా బోరింగే.. అంటూ సమంతను ఉడికించేలా మాట్లాడాడు. అంతేకాదు... నాకు కార్లన్నా.. అమ్మాయిలన్నా ఎంతో ఇష్టం.. అనడంతో వెంటనే సమంత ‘అలా అంటే మొహంపై పంచ్ ఇస్తాను’ అంటూ కొంటెకోపాన్ని ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంటోంది.