2009లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అధికారంలోకి రావాలని కలలు గన్న మెగాస్టార్ చిరంజీవికి ఆ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని ఘోరపరాజయం పాలైంది. ఆ తర్వాత ఇక పార్టీని నడపలేననే నిర్ణయానికి వచ్చిన చిరు ప్రజారాజ్యం పార్టీని సోనియా కాళ్ల ముందు పెట్టి కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. ఈ పరిణామం ఆయన సోదరుడు, జనసేనాధిపతి పవన్‌కి కూడా ఇష్టం లేదనే వార్తలు వచ్చాయి. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడమే కాదు.. జగన్ కాంగ్రెస్ పార్టీని పడగొడతానంటే.. తాను మాత్రం కాంగ్రెస్‌ని నిలబెడతానని చెప్పాడు. చెప్పినట్లే చేశాడు. ప్రతిఫలంగా తనకి కేంద్ర మంత్రి పదవి, తన పార్టీ నుంచి గెలిచిన వారికి రాష్ట్రంలో మంత్రి పదవులు ఇప్పించాడు. నిజానికి నాడు కాంగ్రెస్ పార్టీ విశ్వాస పరీక్షలో ఓడిపోయి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని, ఇప్పటికీ సమైక్యాంధ్రగా ఉండేదని విమర్శలు వచ్చాయి.
ఇక విభజన సమయంలో చిరంజీవి రాజ్యసభలో మాట్లాడుతూ, హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, లేదా ఎల్లకాలం రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండాలని కోరాడు. కానీ పార్టీ ఆయన మాటలను పక్కనపెట్టింది. 2014లో చిరు కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినా కూడా ఒక్క సీటు గెలవలేకపోయింది. చిరు తన మ్యాజిక్‌తో ఓ సీటుని కూడా గెలిపించుకోలేకపోయాయనే విమర్శలతో పాటు జనాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. నాటి నుంచి ఆయన ఉప ఎన్నికల్లో గానీ, కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో గానీ పార్టీ వారు పిలిచినా కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేదు.
తాజాగా ఆయన మరోసారి ఓ అభ్యర్థి కోసం ప్రచారం చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. చిరుకి సన్నిహితుడు, కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన అంబరీష్ మరణానంతరం ఆయన భార్య సుమలత మాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఈమె చిరుకి కూడా ఎంతో సన్నిహితురాలు. దాంతో మెగాస్టార్‌కి మాండ్యాలో కూడా కాస్త ఇమేజ్ ఉండటంంతో తనని గెలిపించేందుకు మాండ్యాలో ప్రచారం నిర్వహించాలని సుమలత చిరుని కోరిందట. కానీ ఈమధ్య రాజకీయ ప్రచారాలే కాదు...రాజకీయ వ్యాఖ్యలు కూడా చేయని చిరు తన పట్టుదలను సుమలత కోసం వీడుతాడా? అనే అనుమానాలు వస్తున్నాయి. కానీ చిరు, సుమలత కోసం ఎన్నికల ప్రచారం చేసే అవకాశమే లేదనే మాట మాత్రం గట్టిగా వినిపిస్తోంది.