ఒకవైపు వైసీపీ పార్టీ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి, సీఎం కేసీఆర్ నుంచి, మజ్లిస్ పార్టీ ఓవైసీ నుంచి మద్దతు కూడగట్టుకున్నాడు. మరోవైపు జగన్‌కి బిజెపితో రహస్య ఒప్పందం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో వైసీపీ నాయకులు మాత్రం ఉల్టా చోర్ అన్నట్లుగా టిడిపికి, జనసేనకి మధ్య రహస్య అవగాహన ఉందంటున్నారు. ఇక మొదట్లో బిజెపి-టిడిపిలకు కిందటి ఎన్నికలలో పవన్ మద్దతు ఇచ్చాడు. కానీ ఈ సారి మాత్రం వామపక్షాలతో కలిసి అన్ని స్థానాలలో పోటీ చేస్తానని ప్రకటించాడు. ఇక బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత మాయావతిని కూడా కలుసుకుని వచ్చాడు. వారితో కూడా పొత్తు ఖరారైంది. వారికి కూడా కూటమిలో భాగంగా కొన్ని సీట్లు కేటాయించాల్సివుంది. బహుజన సమాజ్‌వాదీ పార్టీ ఎంతో కాలంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్నప్పటికీ ఆ ఏనుగు గుర్తుకి కనీసం డిపాజిట్లు కూడా దక్కడం లేదు. కానీ బహుజన సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుద్వారా పవన్ బహుజన, బడుగు, బలహీన వర్గాలను కూడా ఆకర్షించే అవకాశం ఉంది.
మరోవైపు జనసేనాని విశాఖ పరిధిలోకి వచ్చే గాజువాక స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం దాదాపు ఖరారైందని అంటున్నారు. పవన్ గాజువాకలో పోటీ చేయనుండటంతోనే ఆ నియోజకవర్గంలో టిడిపి పార్టీ డమ్మి అభ్యర్థిని పోటీకి దించుతోందని వైసీపీ నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కి చంద్రబాబు టిక్కెట్ నిరాకరించారని ప్రచారం సాగుతోంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో నాడు ప్రజారాజ్యం పార్టీకి భారీగా ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత 2014లో ఈ సీటుని టిడీపి గెలిచింది. ఇప్పటికీ ఇక్కడి టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కి మంచి పట్టే ఉందని కానీ చంద్రబాబు మాత్రం పవన్ గెలిచే విధంగా ఈ విధంగా వ్యవహరిస్తున్నాడని అంటున్నారు.
దీనిని టిడిపి నాయకులు కొట్టి పారేస్తూ ఉండగా, జనసైనికులు మాత్రం తమకు టిడిపితో పాటు ఏ పార్టీనుంచి ఎవరు పోటీ చేసినా జనసేనాని పవన్ విజయం ఇప్పటికే ఖాయమంటున్నారు. అయితే ఈమధ్య చంద్రబాబు, లోకేష్‌లపై మండిపడిన పవన్ కొంతకాలంగా చంద్రబాబు, లోకేష్‌లపై ఘాటైన విమర్శలు మాత్రం చేయడం లేదు. మరోవైపు ఇటీవల ఆయన జగన్‌ని టార్గెట్ చేస్తున్నాడని అర్ధమవుతోంది. దీంతో ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినా కూడా ఎన్నికల అనంతరం చంద్రబాబు, పవన్‌ల మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం సాగుతోంది. మరి రాబోయే రోజుల్లో ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సివుంది....!